మంగళవారం.. ఒక్కటే కాదు

దీపావళి సినిమాల సందడికి తెరపడింది. ఈ పండక్కి తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా లేకపోవడం మన ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. పోనీ అనువాద చిత్రాలైనా మెప్పించాయా అంటే అదీ లేదు. జపాన్, జిగర్‌తండ డబుల్‌ఎక్స్, టైగర్-3.. మూడూ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వీటికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. దీంతో ఇక ఫోకస్ అంతా తర్వాతి వారాంతంలో వచ్చే ‘మంగళవారం’ సినిమా మీదికి మళ్లింది.

‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రం.. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మధ్యలో ‘మహాసముద్రం’తో నిరాశపరిచిన అజయ్.. ఈ చిత్రంతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యేలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమా మీద అజయ్ ఎంత ధీమాగా ఉన్నాడంటే.. దీన్నొక ఫ్రాంఛైజీగా మార్చి ఇదే వరుసలో సినిమాలు తీస్తానని అంటున్నాడు.

‘‘మంగళవారం సినిమాకు కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. రాబోయే చిత్రం ప్రీక్వెలా, సీక్వెలా, ఇంకోటా అనేది చెప్పలేను. కానీ ‘మంగళవారం’ వరల్డ్ మాత్రం కొనసాగుతుంది. దీన్నొక ఫ్రాంఛైజీగా మారుస్తా’’ అని అజయ్ తెలిపాడు. తన తర్వాతి చిత్రం ఇదే అని అతను సంకేతాలు ఇచ్చాడు. ఇక ‘మంగళవారం’ టైటిల్ పెట్టడం గురించి మట్లాడుతూ.. ‘‘మంగళవారాన్ని కొందరు చెడ్డ రోజుగా చూస్తారు. కానీ అది శుభప్రదమైన రోజు. ముందు మనకు మంగళవారమే సెలవు రోజుగా ఉండేది. బ్రిటిషర్లు వచ్చి ఆదివారాన్ని సెలవుగా మార్చారు.

‘మంగళవారం’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే పెద్ద వంశీగారు ఫోన్ చేసి.. ‘మంచి టైటిల్ అ.జయ్. నేను చాలాసార్లు ఆ పేరు పెడదామంటే నిర్మాతలు ఒప్పుకోలేదు’ అన్నారు. ఆయన ఫోన్ చేసి టైటిల్ గురించి మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది’ అని అజయ్ తెలిపాడు. ‘మంగళవారం’ సినిమాలో చివరి 45 నిమిషాలు తీవ్ర ఉత్కంఠభరితంగా ఉంటుందని.. ట్విస్టుల మీద ట్విస్టులుంటాయని.. పాయ్ పాత్ర షాకింగ్‌గా ఉంటుందని, ఆమె పాత్రను చూసి ప్రేక్షకరులు బాధ పడుతూ థియేటర్ల నుంచి బయటికి వస్తారని అజయ్ అన్నాడు.