అభిమాన హీరో సినిమాని మొదటి రోజు చూస్తున్నప్పుడు అభిమానుల్లో ఒకరకమైన ఉద్వేగం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే కేవలం రెండున్నర గంటల వినోదానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని వాళ్ళను ఎందరినో చూస్తుంటాం. అయితే ఇటీవలే కాలంలో ఫ్యానిజం పేరుతో కొందరు హద్దులు దాటడం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టేలా చేస్తోంది. మనకేదైనా పైత్యం ఉంటే అది పక్కవాళ్ళ మీద చూపించకూడదు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా మారతాయి. టైగర్ 3 విడుదల సందర్భంగా జరిగిన సంఘటన దీన్ని స్పష్టం చేస్తోంది.
మహారాష్ట్రలోని మలేగావ్ పట్టణంలో ఉన్న ఒక సింగల్ స్క్రీన్ లో టైగర్ 3 భారీ ఎత్తున విడుదలయ్యింది. రాత్రి సెకండ్ షో మొదలయ్యాక సుమారు 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో సల్మాన్ ఎంట్రీ సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారి బాణాసంచా బయటికి తీసి నేరుగా సీట్ల మధ్యలో కాల్చడం మొదలుపెట్టారు. వాటిలో రాకెట్లు, చిచ్చు బుడ్లు, సీమ టపాకాయలు, లక్ష్మి బాణాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి. నిప్పు రవ్వలు ఎగజిమ్ముతూ పై నుంచి కిందకు పడుతూ ఉంటే హౌస్ ఫుల్ గా ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రాణ నష్టం జరగలేదు.
ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాద్యులు. అసలు అంత భారీ ఎత్తున టపాసులను లోపలి అనుమతించిన సదరు థియేటర్ యాజమాన్యాన్ని ముందుగా బాధ్యత వహించేలా చేయాలి. పోలీసులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ హాలులో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ కు సైతం ఇదే చేశారు. ఇప్పుడు సల్మాన్ ఫ్యాన్స్ వంతు రావడంతో మరికాస్త రెచ్చిపోయారు. థియేటర్లలో అగ్ని ప్రమాదాలు ఎంతటి విషాదానికి తెరతీస్తాయో తెలియాలంటే 1997లో జెపి దత్తా బోర్డర్ ఆడిన ఢిల్లీ ఉపహార్ సంఘటనలో ప్రాణ నష్టం చూస్తే తెలుస్తుంది.