ఒక భాషలో హిట్ అయిన సినిమా డబ్బింగ్ రూపంలో అదే ఫలితాన్ని తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ మధ్య ఇది మరింత స్పష్టంగా తేటతెల్లమవుతోంది. లారెన్స్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేక ఎదురీదుతోంది. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం లేని కంటెంట్ కావడంతో తెలుగు జనాలు ఏమంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమానంగా టాక్ తెచ్చుకున్న ‘జపాన్’ ఇదే దారి పట్టగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మధ్యలో లాభపడటం కనిపిస్తోంది.
ఇదొక్కటే కాదు ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి. సెప్టెంబర్ లో వినాయక చవితికి వచ్చిన విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తీరా చూస్తే మన దగ్గర కనీస స్థాయిలో ఆడలేదు. ‘పొన్నియిన్ సెల్వన్’ని వాళ్ళు నెత్తినబెట్టుకుంటే మనకు మణిరత్నం టేకింగ్ అర్థం కాలేదు. విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 1’ ఫలితమూ ఇంతే. వెట్రిమారన్ టేకింగ్ లోని గొప్పదనాన్ని మనోళ్లు రిసీవ్ చేసుకోలేకపోయారు. రివ్యూలు, టాక్ బాగున్నప్పటికీ అది గ్రౌండ్ లెవల్ లో క్యాష్ కాలేదు. కన్నడ మూవీ ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’ కూడా ఇదే రిపీట్ అయ్యింది.
ఒకప్పుడు శంకర్, గౌతమ్ మీనన్, మణిరత్నం డబ్బింగ్ సినిమాలకు ఒకటే స్పందన వచ్చేది కానీ మారుతున్న పరిస్థితులు అభిరుచులకు అనుగుణుంగా ఇప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో హిట్టు కొట్టిందని సంబర పడి హక్కులు కొనేసుకుంటే తర్వాత అయ్యో అనుకోవాల్సి పరిస్థితి తలెత్తుతోంది. కెజిఎఫ్, విక్రమ్, లియో లాంటివి మినహాయింపుగా చెప్పుకోవచ్చు కానీ ప్రతిసారి అలాంటి గ్రాండియర్లే రావుగా. ప్రమోషన్లు, పబ్లిసిటీ హంగామా చేసినా మన నేటివిటీకి దగ్గరగా ఉంటేనే కొత్త తరం అంగీకరిస్తోంది. లేదంటే ఎంత పెద్ద బ్యానర్ ఉన్నా డిజాస్టర్లు తప్పవు.