కీడాకోలా.. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టిందా?

కీడాకోలా.. గత వారాంతంలో మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. తరుణ్ భాస్కర్ సినిమా అనగానే క్రేజీగా ఉంటుందని యూత్ ఆడియన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు ఈ సినిమా మీద. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు తరుణ్. మేకింగ్‌కు కూడా బాగానే టైం పట్టింది. ఈ సినిమా ప్రోమోలు చూసి ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు.

ప్రి రిలీజ్ హైప్ కూడా బాగానే వచ్చింది. ఇందులో స్టార్ కాస్ట్ లేకపోయినా సరే.. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరిగాయి. సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి. ప్రి రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ గురించి ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడో తెలిసిందే. తన తొలి రెండు చిత్రాల విషయంలో తనకు భయం ఉండేదని.. కానీ ‘కీడాకోలా’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అతను మాట్లాడాడు.

కట్ చేస్తే ‘కీడా కోలా’కు తొలి రోజు మంచి ఓపెనింగ్స్‌ అయితే వచ్చాయి కానీ టాక్ మాత్రం డివైడ్‌గా వచ్చింది. మరీ పలుచనైన, సిల్లీగా అనిపించే కథ దీనికి పెద్ద మైనస్ అయింది. ఈ సినిమాలో ఫన్నీ మూమెంట్స్ లేవని కాదు. కొన్ని సీన్లు కడుపుబ్బ నవ్వించాయి. కానీ అక్కడక్కడా కొన్ని మూమెంట్సే తప్ప ఓవరాల్‌గా సినిమాలో బరువు లేకపోయింది. ఏదో అలా టైంపాస్ చేశారే తప్ప ప్రేక్షకులు కోరుకున్న కిక్ దక్కలేదు. తొలి రోజు సందడి చేశాక రెండో రోజుకే ‘కీడా కోలా’ డౌన్ అయింది.

వీకెండ్ తర్వాత సినిమా అస్సలు నిలబడలేకపోయింది. చిన్న సినిమా అయిన ‘మా ఊరి పొలిమేర-2’ దీని మీద పూర్తిగా డామినేషన్ చూపించింది. ‘కీడా కోలా’ మీద తరుణ్ భాస్కర్ పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. ఏదో సినిమా వచ్చింది వెళ్లిపోయింది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. స్క్రిప్టు, టేకింగ్ విషయంలో తరుణ్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడన్నది స్పష్టం. చిన్న బడ్జెట్లో తెరకెక్కడం, తరుణ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి ఉండొచ్చు కానీ.. ఇకముందు మాత్రం తరుణ్ ఇలాంటి సినిమాలు తీస్తే కష్టమే.