మంగళవారంకి కిక్ ఇస్తున్న పొలిమేర

తెలుగు జనాలకు ఈ మధ్య హారర్, అందులోనూ చేతబడుల మీద వచ్చే సినిమాలు బాగా ఎక్కేస్తున్నాయి. నిన్న విడుదలైన మా ఊరి పొలిమేర 2కి దాదాపు అన్ని సెంటర్లలో స్పందన బాగుంది. చాలా చోట్ల క్రేజ్ ఉన్న కీడా కోలా కంటే దీనికే వసూళ్లు ఎక్కువ రావడం విశేషం. అలా అని యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ పర్లేదు ఓసారి చూడొచ్చనే టాక్, ట్విస్టుల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వసూళ్లకు దోహదపడుతున్నాయి. జరిగిన బిజినెస్, పెట్టిన పెట్టుబడి కోణంలో చూసుకుంటే ఇందులో భాగమైన వాళ్లకు మంచి లాభాలే దక్కబోతున్నాయి.

దీనికి మంగళవారంకి ముడి ఏంటనే పాయింట్ కు వద్దాం. ఈ నెల 17న విడుదల కాబోతున్న ఈ మల్టీ లాంగ్వేజ్ మూవీ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. మా ఊరి పొలిమేర 2 తరహాలోనే మంగళవారం కూడా ఒక గ్రామం, అంతు చిక్కని రీతిలో హత్యలు, చేతబడుల ప్రహసనం, వీటన్నటి వెనుక అంతు చిక్కని మిస్టరీ ఇలా ఒక టెంప్లేట్ ప్రకారం జరుగుతుంది. ఇదే ఏడాది విరూపాక్ష ఈ జానర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు పొలిమేర కలెక్షన్లు చూశాక మంగళవారంకు ఖచ్చితంగా హైప్ చాలా ఎక్కువ ఉంటుందని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.

పోలిక పరంగా చూసుకుంటే మంగళవారంలో కంటెంట్ రిచ్ గా ఉంటుంది. ప్రొడక్షన్ పరంగా బాగా ఖర్చు పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోకనాథ్ సమకూర్చారు. క్యాస్టింగ్ చాలా పెద్దది. ట్రైలర్ వచ్చాక థియేటర్ హక్కులు మూడింతలు ఎక్కువ రేట్లకు అమ్ముడుపోయాయని ఎగ్జిబిటర్ల నుంచి అందిన సమాచారం. సో క్వాలిటీ పరంగా మా ఊరి పొలిమేర 2 కంటే ఎన్నోరెట్లు మెరుగైన మేకింగ్ తో రూపొందిన మంగళవారం కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే భారీ హిట్టుని ఆశించవచ్చు. ఎలాగూ చెప్పుకోదగ్గ పోటీ లేదు కాబట్టి ఆ ఛాన్స్ ని ఎలా వాడుకుంటారో చూడాలి. ఇందులో పాయల్ రాజ్ పుత్ పాత్ర చాలా షాకింగ్ గా ఉంటుందట.