మహేష్ బాబు ముందే వచ్చేస్తాడా

సంక్రాంతి పండక్కు అసలు సిసలైన మాస్ ఎంటర్ టైనర్ గా టీమ్ బాగా ప్రమోట్ చేస్తున్న గుంటూరు కారం జనవరి 12 నుంచి ఒక రోజు ముందు వచ్చేలా ముంతనాలు జరుపుతోందని ఇన్ సైడ్ టాక్. ఎలాగూ అప్పటికి సెలవులు మొదలైపోయి ఉంటాయి కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలంటే ముందు రావడమే కరెక్టని నిర్మాత నాగవంశీ భావిస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి దిల్ రాజు సైతం మద్దతు తెలిపారట. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ముందే వస్తే కలెక్షన్లు థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు కాబట్టి ఆ దిశగా ఆలోచించమని సలహా ఇచ్చారట. ఇంకా ఫైనల్ కాలేదు.

ఒకవేళ నిజమయ్యే పక్షంలో గుంటూరు కారంని జనవరి 11నే చూసేయొచ్చు. గతంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో క్లాష్ జరిగినప్పుడు ఇదే సమస్య వచ్చింది. బన్నీ ఒక రోజు లేట్ గా వచ్చాడు. పైచేయి ఎవరిదనేది పక్కనపెడితే రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ అప్పటి పోటీ ఇద్దరికే పరిమితం. కానీ ఇప్పుడలా లేదు. వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకున్న తేజ సజ్జ  బరిలో ఉన్నాడు. ఇదేదో గుంటూరు కారం మీద ప్రభావం చూపిస్తుందని కాదు కానీ మాస్ కెపాసిటీ ఉన్న మూవీని వీలైనంత మేర పిండుకునే మార్గాల మీద దృష్టి పెట్టాలి.

ఫస్ట్ లిరికల్ వీడియో లోగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. జనవరి పదకొండు అయితే లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. బిజినెస్ స్కేల్ పెద్దది కాబట్టి తగినంత స్పేస్ దక్కడం చాలా అవసరం. వీలైతే పదో తేదీ వచ్చినా నష్టం లేదు లాభమే తప్ప. కాకపోతే అది మహేష్ మనసులో ఏముందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. తమన్ పాటల సందడి ఇంకో వారంలో మొదలవ్వొచ్చు. ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముందు మెలోడీ సాంగ్ తో మొదలుపెట్టి హైప్ పెరిగే కొద్దీ ఇతర మాస్ పాటలు వదిలేలా ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ పీక్స్ మాస్ గుంటూరు కారంలో చూడబోతున్నాం.