‘బిగ్ బాస్-4’ డేట్ ఫిక్సయిపోయిందహో

ఎన్నో సందేహాల మధ్య తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టి తొలి సీజన్లోనే అదిరిపోయే స్పందన తెచ్చుకున్న ప్రోగ్రాం ‘బిగ్ బాస్’. మూడేళ్లుగా ఈ ప్రోగ్రాం తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతిసారీ ఈ షో మీద విమర్శలు, అభ్యంతరాలు కామనే. కానీ ఆదరణ విషయంలో ఆ షోకు ఢోకా లేదు. ఈసారి కరోనా కారణంగా జనాలు బయట తిరిగి ఎంజాయ్ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో మరింతగా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు. ‘బిగ్ బాస్’లో తొలిసారిగా క్రితం సంవత్సరం ఉన్న హోస్టే.. మళ్లీ కొనసాగుతున్నారు. నిరుడు షోను హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జునే ఈసారి కూడా ‘బిగ్ బాస్’ను నడిపించబోతున్నారు. ఆయన ముఖచిత్రంతో ఇప్పటికే ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ ప్రోమో కూడా రిలీజైంది. అతి త్వరలోనే షో మొదలవుతుందని అందులో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘బిగ్ బాస్-4’ డేట్ ఖరారైంది.

సెప్టెంబరు 6న, ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ ఆరంభోత్సవం జరగనుంది. ఆ రోజే షోలో పాల్గొనబోయే 12 మంది పార్టిసిపెంట్లను ప్రకటించబోతున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి షోలో పార్టిసిపెంట్లు, రోజుల సంఖ్యన తగ్గించినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి షోను 72 రోజులకు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. నటుడు నోయెల్, డ్యాన్స్ మాస్టర్ రఘు, టీవీ 9 యాంకర్ దేవి, మాజీ డ్యాన్స్ మాస్టర్ రాజశేఖర్, యాంకర్ లాస్య లాంటి వాళ్ల పేర్లు పార్టిసిపెంట్లుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో చూడాలి. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య షోను నిర్వహించనున్నారు. పార్టిసిపెంట్లను ఇప్పటికే క్వారంటైన్ చేసినట్లు తెలుస్తోంది. వారికి షో సందర్భంగా అందజేసే వస్తువులన్నీ శానిటైజ్ చేసి ఇవ్వనున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలేవీ కూడా ఉండవని సమాచారం.