‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అతడికి బహు భాషల్లో భారీగా అభిమానగణం తయారైంది. తెలుగు ప్రేక్షకులైతే అతడి పేరు చెబితే ఊగిపోయే పరిస్థితి వచ్చింది. ‘లియో’ సినిమాకు ఒక రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయన్నా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయన్నా విజయ్‌ని మించి లోకేష్‌కు ఇక్కడున్న క్రేజే ప్రధాన కారణం. ఐతే ‘లియో’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
లోకేష్ కెరీర్లో వీకెస్ట్ మూవీ ఇదే అనడంలో సందేహం లేదు. అసలేముందని ఈ కథతో సినిమా తీశాడు అనే ప్రశ్నలు తలెత్తాయి. అతను అప్పుడే టచ్ కోల్పోయాడా.. తనలో కంటెంట్ అయిపోయిందా అనే చర్చ జరిగింది. ఐతే తన ప్రతి సినిమాకూ వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని పని చేస్తానని చెప్పే లోకేష్.. తన తర్వాతి చిత్రం విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
‘లియో’ విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు.. స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి పడటం. ‘విక్రమ్’ రిలీజైన కొన్ని రోజులకే ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. స్క్రిప్టు సరిగా తీర్చిదిద్దుకోలేదు. షూటింగ్ కూడా హడావుడిగా చేసేశారు. ముందే రిలీజ్ డేట్ డెడ్ లైన్ పెట్టుకుని ఆ ప్రెజర్ మీద పని చేశాడు లోకేష్. ఆ ఎఫెక్ట్ ఔట్ పుట్ మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ హడావుడి పడట్లేదట.
రజినీకాంత్‌తో కొత్త సినిమాను ఒక వైవిధ్యమైన కథతో చేయబోతున్న లోకేష్.. దీని మీద ఆరు నెలల పాటు పని చేయనున్నాడట. రజినీ అందుబాటులోకి రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి అతడి మీద ఒత్తిడి లేదు. షూటింగ్ కూడా హడావుడి లేకుండా వీలైనంత టైం తీసుకుని చేయాలని లోకేష్ ఫిక్సయ్యాడట. కాబట్టి అతడి నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది. కాబట్టి ఈసారి అతడి నుంచి మంచి క్వాలిటీ మూవీ ఆశించవచ్చు.