కంగనాకు క్రిష్ శాపం తగిలిందా?

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు. మన టైం నడుస్తున్నపుడు ఎగిరెగిరి పడితే.. హద్దులు దాటి ప్రవర్తిస్తే మాట్లాడితే.. ఆ టైం తిరగబడ్డపుడు జాలిపడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. బాలీవుడ్లో ఏ హీరోయిన్‌కూ రాని హీరోయిక్ ఇమేజ్ తెచ్చుకున్న ఘనురాలు కంగనా. కెరీర్ ఆరంభంలో రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసింది కానీ.. ‘క్వీన్’తో ఆమె దశ తిరిగింది.

తర్వాత తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి చిత్రాలు ఆమె ఇమేజ్‌ను ఇంకా పెంచాయి. కంగనా పేరు మీద వంద కోట్ల బిజినెస్ జరిగే స్థాయి వచ్చింది. ఆ టైంలోనే ఆమె ‘మణికర్ణిక’ అనే భారీ చిత్రం మొదలుపెట్టింది. తెలుగువాడైన క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మొదలైనపుడు మేకింగ్ దశలో అంతా బాగానే సాగింది.  కానీ సినిమా పూర్తయ్యాక వ్యవహారం తేడా కొట్టింది. తనకు ఆ సీన్ నచ్చలేదని, ఈ క్యారెక్టర్ బాలేదని.. ఏవేవో కారణాలు చెప్పి క్రిష్‌‌ను పక్కన పెట్టి స్వయంగా తనే రీషూట్లు చేసింది కంగనా. ఎడిటింగ్ కూడా తనకు నచ్చినట్లు చేసుకుంది.

ముందు క్రిష్‌తో పాటు తననూ దర్శకురాలిగా పేర్కొన్న ఆమె.. తర్వాత పూర్తిగా అతడి పేరు తీసేసి తననే దర్శకురాలిగా చూపించుకుంది. ఆ టైంలో క్రిష్ వేదన అరణ్య రోదనగా మారింది. క్రిష్ మీద కంగనాతో పాటు ఆమె సోదరి దారుణంగా ఎటాక్ చేశారు. ‘మణికర్ణిక’ సినిమా బాగానే ఆడింది కానీ.. ఆ తర్వాతే కంగనా కెరీర్ అడ్డం తిరిగింది. వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. ‘మణికర్ణిక’ సక్సెస్ గర్వం తలకెక్కి బాలీవుడ్లో హృతిక్ రోషన్, కరణ్ జోహార్ సహా ఎంతోమందిని అకారణంగా ఆమె టార్గెట్ చేయడం తెలిసిందే. వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటుంటే ప్రతి విషయంలోనూ వేలు పెట్టి.. వాళ్ల సినిమాలు పోయినపుడు వెటకారాలు ఆడి జనం దృష్టిలో విలన్ అయింది కంగనా.

దీనికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భజనపరురాలిగా మారి ప్రతిపక్ష పార్టీలనూ కూడా ఎటాక్ చేసింది. దీంతో జనాల్లో ఆమె పట్ల ఒక ఏహ్య భావం ఏర్పడింది. ఫలితమే.. ఆమె సినిమాలను పట్టించుకోవడం మానేశారు. జడ్జిమెంటల్ హై క్యా, ధకడ్, తలైవి, చంద్రముఖి-2.. ఇలా గత రెండు మూడేళ్లలో కంగనా నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లే. ఆమె లేటెస్ట్ రిలీజ్ ‘తేజస్’ను కూడా ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. ఇదంతా చూసి క్రిష్‌ను వేదనకు గురి చేయడంతో పాటు చాలామందిని అకారణంగా టార్గెట్ చేసిన పాపానికి ఆమె ఇప్పుడు ఫలితం అనుభవిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.