హనుమంతుడికి 45 కోట్ల ఆఫర్

భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన రామాయణంగా తెరకెక్కబోతున్న నితీష్ తివారి ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాకుండానే హాట్ టాపిక్ గా మారిపోయింది. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించబోతున్న ఈ ఎపిక్ డ్రామాలో యష్ ని రావణుడిగా నటింపజేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎస్ చెప్పినట్టు ముంబై మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కానీ బెంగళూరు సమాచారం మాత్రం ఇంకా ఆలోచనలో ఉన్నాడని స్పష్టం చేస్తోంది. సరే ఇవన్నీ ఇంకొద్ది రోజుల్లో తేలబోయే విషయాలు కానీ ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ టాక్ వచ్చింది.

కీలకమైన హనుమంతుడి పాత్రకు సన్నీ డియోల్ ని ఆప్షన్ గా పెట్టుకున్నారట. అయితే ఈయన రెమ్యునరేషన్ గదర్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత 70 కోట్ల దాకా ఉంది. బోర్డర్ సీక్వెల్ కోసం యాభై కోట్లతో మంతనాలు మొదలయ్యాయి. ఒకవేళ హనుమంతుడిగా తనకు ఆఫర్ ఇస్తే డిస్కౌంట్ ఇచ్చి 45 కోట్లకే చేయడంతో పాటు మధ్యలో ఇంకే షూటింగులు లేకుండా కాల్ షీట్స్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపట్ల నితీష్ తివారి, మరో నిర్మాత మధు మంతెనను సానుకూలంగా ఉన్నారని తెలిసింది. ఒకవేళ ఓకే అయితే మాత్రం రామాయణం క్యాస్టింగ్ స్కేల్ బిజినెస్ పరంగా అమాంతం పెరిగినట్టే.

రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడబోతున్నాయి. రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు ఈ నలుగురు లాకైపోతే మిగిలిన తారాగణం గురించి పెద్దగా టెన్షన్ ఉండదు. లక్ష్మణుడుగా ఇంకో స్టార్ హీరోని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇది రెండు మూడు భాగాలుగా తీయాలనే ప్రణాళిక ఉందట. ఆదిపురుష్ లో జరిగిన దారుణమైన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ నేపథ్యంలో ఒక్కసారిగా నార్త్ లో రామాయణ సినిమాల ట్రెండ్ ఊపందుకోవడం విశేషం.