లాక్ డౌన్‌లో శివమణి డ్యూటీ చేస్తే..

శివమణి.. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. మరీ బ్లాక్ బస్టర్ ఏమీ అయిపోలేదు కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చింది.

‘‘నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్’’ అనే పూరి మార్కు డైలాగ్ భలేగా పేలింది. సినిమాలో నాగార్జున క్యారెక్టరైజేషన్, ఆయన డైలాగులు సూపర్ పాపులర్ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నాడు. ‘శివమణి’లో పూర్ణా మార్కెట్ ఏరియాకు కొత్త సీఐగా వచ్చిన నాగ్.. రౌడీలందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. చాలా సరదాగా సాగిపోయే ఆ సన్నివేశాన్ని ఇప్పటి కరోనా కల్లోల పరిస్థితులకు తగ్గట్లు స్పూఫ్ చేశారు. మిమిక్రీ ఆర్టిస్టు భవిరి రవి నాగ్‌ వాయిస్‌ను ఇమిటేట్ చేసిన వీడియో ఇది.

https://www.youtube.com/watch?v=-lFRN5KzNrI

సినిమాలో రౌడీయిజం మానేయమని నాగ్ వార్నింగ్ ఇస్తే.. మాస్కులు పెట్టుకోండి, బయట గుంపులు గుంపులుగా తిరక్కండి అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు మిమిక్రీ చేశారు. ఏదో మొక్కుబడిగా కాకుండా సినిమాలో డైలాగులకు తగ్గట్లే ఫన్నీగా డైలాగులు రాశారు. కొన్ని రోజులుగా ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నాగ్ వరకు వెళ్లింది. దీన్ని నాగ్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ.. ఇప్పుడు కనుక ‘శివమణి’ సినిమా తీస్తే పూరి జగన్నాథ్ డైలాగులు సరిగ్గా ఇలాగే ఉండేవని కామెంట్ చేశాడు.

దీనిపై పూరి సైతం స్పందించాడు. ఇది సూపర్‌‌గా ఉంది అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ వీడియోకు మరింత పాపులారిటీ వచ్చింది. నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తుండగా.. పూరి విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘శివమణి’ తర్వాత కలిసి పని చేయని నాగ్, పూరి భవిష్యత్తులో ఏమైనా ఇంకో సినిమా చేస్తారేమో చూడాలి.