వరుణ్ తేజ్ వైపే ఎక్కువ రిస్కు

డిసెంబర్ రిలీజుల మీద అప్పుడే వాడి వేడి చర్చలు మొదలైపోయాయి. 7న హాయ్ నాన్న వస్తుండగా, 8న ఏకంగా మరో మూడు సినిమాలు నువ్వా నేనాని తలపడటం ట్రేడ్ ని ఖంగారు పెడుతోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో ఒకరిని రాజీ చేయించేందుకు ఇండస్ట్రీ పెద్దలు నడుం బిగించారన్న వార్తల నేపథ్యంలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గే సూచనలు లేకపోలేదు. విశ్వక్ సేన్, నితిన్ ఇద్దరూ కెరీర్ పరంగా సమఉజ్జిలు కానప్పటికీ కంటెంట్ ప్లస్ బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే వేటికవే ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. సో క్లాష్ టఫ్ గానే ఉంటుంది.

ఒకవేళ తగ్గలేదు అనుకుందాం. వీటితో పాటు ఎనిమిదినే ప్లాన్ చేసుకున్న వరుణ్ తేజ్ కే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆపరేషన్ వాలెంటైన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎయిర్ ఫోర్స్ సాహసాలను ఆధారంగా చేసుకుని తీసింది. ప్రేమకథను కూడా జోడించారు. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కి ఇదే మొదటి చిత్రం. డైరెక్టర్ బ్రాండ్ పని చేయదు. ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు కాబట్టి ఏఏ అంశాలు ఉంటాయనేది ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఎలా చూసుకున్నా ఇది మాస్ కి కనెక్ట్ అయ్యే కమర్షియల్ కాన్సెప్ట్ కాదు.

గతంలో వరుణ్ తేజ్ ఇదే తరహాలో అంతరిక్షం, గాండీవధారి అర్జున లాంటి ప్రయోగాలు చేసి చేదు ఫలితాలు చూశాడు. ఆపరేషన్ వాలెంటైన్ అలా కాకపోవచ్చు. అయినా సరే సోలోగా రావడం వల్ల కలిగే లాభాలు ఇలా ఇంత పోటీలో దిగడం వల్ల ఖచ్చితంగా రావు. పైగా డిసెంబర్ నెల సంక్రాంతి, దసరా లాగా సీజన్ కాదు. ఒకరకంగా డ్రై మంత్ గా భావిస్తారు. అలాంటప్పుడు నాని, విశ్వక్, నితిన్ లతో తలపడటం అంత సేఫ్ అనిపించుకోదు. టాక్ ఎంత బాగా వచ్చినా ఓపెనింగ్స్ తో సహా అన్నింటిని పంచుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు ఇవన్నీ ఆలోచించే మూడ్ లో లేనట్టే కనిపిస్తోంది.