తెలుగులో విజయ్ తర్వాతే వాళ్లందరూ

తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ హీరోల జాబితా చాలా పెద్దదే. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, జీవా, ధనుష్, విజయ్ ఆంటోనీ.. ఇలా చాలా మంది ఇక్కడ తమకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు ఆయా వివిధ దశల్లో. ఐతే తమిళం నుంచి చిన్నా చితకా హీరోలు కూడా తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్న టైంలో విజయ్ అనే టాప్ తమిళ స్టార్‌కు ఇక్కడ మినిమం గుర్తింపు ఉండేది కాదు.

అతడి అనువాద చిత్రాలు వస్తుంటే పట్టించుకునేవాళ్లే కాదు మన ప్రేక్షకులు. చాలా ఏళ్లు ఇలాగే గడిచింది. కానీ గత దశాబ్ద కాలంలో వేగంగా పరిస్థితులు మారిపోయాయి. మిగతా తమిళ స్టార్ల మార్కెట్ పడుతూ వస్తుంటే.. విజయ్ నెమ్మదిగా ఇక్కడ ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకుంటూ వచ్చాడు. తుపాకి, జిల్లా లాంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడి తనకు బేస్ వేశాయి. ఆ పునాది మీద నెమ్మదిగా మార్కెట్ పెంచుకుంటూ సాగుతున్నాడు విజయ్.

రజినీ, కమల్ లాంటి సీనియర్ల మాదిరి తెలుగులో భారీ మార్కెట్ సంపాదించుకోకపోయినా.. తనకంటూ మీడియం రేంజ్ సెట్ చేసుకున్నాడు విజయ్. అందుకు తగ్గట్లే చాలా ఏళ్లుగా అతడి సినిమాలు తెలుగులో బిజినెస్ చేస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి విజయ్ ప్రతి చిత్రం మినిమం పది కోట్ల బిజినెస్ చేస్తోంది. ఇప్పుడది రూ.15 కోట్లు కూడా దాటిపోయింది. ఈ మొత్తం పెట్టడం ఇక్కడి నిర్మాతలకు రిస్క్ అనిపించట్లేదు.

విజయ్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఆ మేరకు ఈజీగా బిజినెస్ చేసేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో తెలుగులో అత్యధిక బ్రేక్ ఈవెన్ సినిమాలున్న హీరో విజయే కావడం విశేషం. ఒక్క ‘బీస్ట్’ మాత్రమే బయ్యర్లకు నష్టాలు తెచ్చింది. దానికి కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తుపాకి, జిల్లా, అదిరింది, సర్కార్, విజిల్.. ఇలా విజయ్ సినిమాలన్నీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్కును దాటి విజయ్‌ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టాయి. తాజాగా ‘లియో’ కూడా డివైడ్ టాక్‌ను తట్టుకుని సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. ప్రస్తుతం మరే తమిళ హీరోకూ తెలుగులో ఇంత మంచి సక్సెస్ రేట్ లేకపోవడం విశేషం.