గుంటూరు కారంలో రాజకీయ ఘాటు

జనవరి సంక్రాంతి పండగను లక్ష్యంగా పెట్టుకుని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. నిర్మాత నాగవంశీ ఆ మధ్య దసరాకు టాకీ పార్ట్ పూర్తవుతుందని అన్నారు కానీ వాస్తవానికది సాధ్యపడలేదు. మధ్యలో కొందరు కీలక ఆర్టిస్టుల డేట్ల సమస్య వల్ల చిన్న చిన్న బ్రేకులు తప్పలేదు. ఇంకా పాటలు బాలన్స్ ఉన్నాయి. భగవంత్ కేసరి ప్రమోషన్ల కోసం వారం రోజులకు పైగా డేట్లు కేటాయించిన శ్రీలీల ఇప్పుడా హడావిడి పూర్తయిపోవడంతో తిరిగి మహేష్ తో జత కట్టనుంది. ఇంతకీ సాంగ్స్ షూట్ ఎప్పుడు అయిపోతుందనేది సస్పెన్స్ గానే ఉంది.

అసలు విషయానికి వస్తే లీకవుతున్న టాక్ ప్రకారం గుంటూరు కారంలో రాజకీయ ఘాటు ఎక్కువగానే ఉందట. అయితే వివాదాస్పద అంశాలు లేకుండా కేవలం హీరోయిజం కోణంలోనే హైలైట్ అయ్యేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ ఫుల్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా మహేష్ ప్రత్యర్థి పొలిటికల్ మీటింగ్ జరుగుతున్న పబ్లిక్ ప్లేస్ కి వెళ్లి బీడీ కాల్చుకుంటూ మరీ శత్రువుకి వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా గొప్పగా వచ్చిందని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు. మహేష్ తాతయ్యగా నటిస్తున్న ప్రకాష్ రాజ్ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

టైటిల్ ఏదో మసాలా సినిమాలా అనిపించినా గుంటూరు వాస్తవ్యులైన హీరో కుటుంబానికి ఉండే పొలిటికల్ బ్యాక్ డ్రాపే ప్రధానాంశంగా ఉంటుందని అంటున్నారు. పోకిరి, ఒక్కడు, బిజినెస్ మెన్ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఎలివేషన్లు మహేష్ కు పడలేదు. భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద హిట్ అయినా అవి ఎంతో కొంత లోటుతోనే బ్లాక్ బస్టరయ్యాయి. కానీ ఈసారి అంచనాలకు మించి గుంటూరు కారంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట. నాగవంశీ ప్రతిసారి అంత కాన్ఫిడెంట్ గా కనిపించడానికి కారణం కూడా అదే అంటున్నారు. చూద్దాం.