పఠాన్, జవాన్.. ఈ రెండు చిత్రాలతో ఈ ఏడాది రెండుసార్లు వెయ్యి కోట్ల మార్కును అందుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఆయన చివరి రెండు మూడు సినిమాలు వంద కోట్ల వసూళ్లు అందుకోవడానికి కూడా కష్టపడ్డాయి. అలాంటిది వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడమంటే మాటలు కాదు. షారుఖ్ ఇంతటితో ఆగేలా లేడు. ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన అరుదైన నటుడిగానూ రికార్డులకు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.
మినిమం సూపర్ హిట్ తప్ప ఇంకే సినిమా తీయడని పేరున్న రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘డుంకి’ ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ క్రిస్మస్ రేసులోకి వచ్చిన నేపథ్యంలో ‘డుంకి’ ఆ సీజన్లో రిలీజవుతుందా లేదా అన్న డౌట్లు ఉండేవి. కానీ టీం ఆ డేట్‌కే కట్టుబడి ఉంది. తాజాగా డిసెంబరు 21న ఇంటర్నేషనల్ రిలీజ్‌ను ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ సినిమా కథ గురించి.. ఈ కథ ఏ ప్రాంతాల్లో నడుస్తుందనే విషయం గురించి హింట్స్ కూడా ఇచ్చింది. ఒక మాట కోసం ఒక సైనికుడు చేసే ప్రయాణమే ఈ సినిమా అని పోస్టర్ మీద వేసిన సంగతి తెలిసిందే. అంతే కాక బ్యాగ్రౌండ్లో ఒక మ్యాప్.. అందులో ఒక జర్నీని సూచించే హింట్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణాన్ని సూచించేలా మార్క్ చేశారు ఆ మ్యాప్‌లో.
అంటే ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుందన్నమాట. హీరో హైదరాబాద్ నుంచే తన జర్నీని మొదలుపెట్టి.. ఆ తర్వాత లండన్‌కు వెళ్లి అక్కడ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడన్నమాట. షారుఖ్‌కు హైదరాబాద్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. పఠాన్, జవాన్ సినిమాలు రెండూ ఇక్కడ భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కథకు నేపథ్యంగా హైదరాబాద్‌ను ఎంచుకుని ఇక్కడి ప్రేక్షకులు మరింతగా తన సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేయబోతున్నట్లు కనిపిస్తోంది.