తమన్ వల్లే మైలేజ్ తగ్గిందా

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే సంగీతం ఇప్పుడెంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురములో, పుష్ప లాంటి భారీ చిత్రాలైనా, డీజే టిల్లు లాంటి బడ్జెట్ మూవీ అయినా బజ్ తీసుకురావడంలో మ్యూజిక్ ప్రభావం అంతా ఇంతా కాదు. దసరా బరిలో విజేతగా దూసుకుపోతున్న భగవంత్ కేసరి వసూళ్ల పరంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ రిపీట్ ఆడియన్స్ ని రప్పించడంలో ఒక్క అంశం స్పీడ్ బ్రేక్ లా నిలిచింది. అదే తమన్ పాటలు. గణేష్ యాంతం పేరుతో వదిలిన ఫస్ట్ ఆడియో సింగల్ కనీసం వినాయక చవితి మంటపాల్లో కూడా పెద్దగా వినిపించలేదు.

బాలయ్య, శ్రీలీల ఎంత హుషారుగా నర్తించినా వాళ్ళ జోష్ కు తగ్గ ట్యూన్ పడలేదు. కూలి నెంబర్ 1, జై చిరంజీవా రేంజ్ లో ఒక ఐకానిక్ గణేశుడి పాట ఉండాల్సింది. ఎమోషన్ ప్లస్ సెంటిమెంట్ కలగలిసిన ఉయ్యాలో ఉయ్యాలో స్క్రీన్ మీద చూసేందుకు బాగుంది కానీ ఆడియో పరంగా రిపీట్ వేల్యూ లేదని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయం. ఇలాంటి కథకు డ్యూయెట్లు, ఐటెం సాంగ్స్ అవసరం లేదు. సందర్భానికి తగ్గట్టు మళ్ళీ వినేలా పాడుకునేలా కుదిరితే చాలు. రోర్ అఫ్ కేసరి బాగుంది కానీ అఖండ, లెజెండ్ రేంజ్ లో లేదనే అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం.

మిగిలిన మరో రీమిక్స్ పాటని జోడించే సూచనలు తగ్గిపోతున్నాయి. దాదాపు లేనట్టేనని ఇన్ సైడ్ టాక్. ఫ్లోకు అడ్డం వస్తుంది కాబట్టి ఎంత బాగా షూట్ చేసినా యాడ్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు తమన్ నిరాశ పరచలేదు. ఇదే ప్రధానంగా ఊరట కలిగించే అంశం. ఇదంతా ప్రత్యేకంగా ప్రస్తావించాడనికి కారణం జనం మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేసేవి మాస్ ఎలిమెంట్స్, పాటలు. మొదటి దాంట్లో కేసరి తనవంతు పాత్ర పోషించగా రెండోది మాత్రం తమన్ స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయింది. లేకపోతే మైలేజ్ ఇంకా ఎక్కువ వచ్చేదన్న మాట వాస్తవం.