ఛత్రపతికి ఇది సరైన సమయం కాదు

ఎల్లుండి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఛత్రపతి రీ రిలీజ్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ కి పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా డార్లింగ్ లోని అసలైన యాక్షన్ మాస్ ని బయటికి తీసుకొచ్చింది ఈ సినిమానే. చాలా కాలంగా దీన్ని మళ్ళీ థియేటర్లలో చూడాలని ఉందని ఫాన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ ట్రెండ్ ఉధృతంగా ఉన్నప్పుడు బిల్లా, రెబెల్ లాంటి యావరేజ్, ఫ్లాప్ లు వదిలారు కానీ ఛత్రపతి బయటికి రాలేదు. వర్షం కూడా ఆశించిన స్పందన దక్కించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఛత్రపతి ఒక విధమైన రాంగ్ టైమింగ్ తో వస్తోంది

దసరా సినిమాలు మూడు బాక్సాఫీస్ వద్ద మొన్న నిన్నా వచ్చాయి. టాక్స్ ఎలా ఉన్నా పండగ అయ్యే దాకా వీటి హడావిడే ఉంటుంది. అగ్రిమెంట్లు కూడా దానికి తగ్గట్టే చేసుకున్నారు. భగవంత్ కేసరి లీడ్ లో ఉండగా, నెగటివ్ టాక్ తోనూ లియో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావు రిపోర్ట్స్ ఆశాజనకంగా లేకపోయినా పండగ అడ్వాంటేజ్ ని వాడుకునే ఛాన్స్ లేకపోలేదు. వీటికి థియేటర్లు అధిక శాతం బ్లాక్ అయిపోయాయి. మెయిన్ సెంటర్స్ లో గణపథ్ కొన్ని తీసుకోగా మ్యాడ్ కంటిన్యూ చేస్తున్న కేంద్రాలు లేకపోలేదు. వీటి మధ్య ఛత్రపతి దిగడం అంత కరెక్ట్ కాదనేది ట్రేడ్ టాక్.

ఇప్పటికే జనాలు రీ రిలీజుల పట్ల మొహం మొత్తిపోయి ఉన్నారు. కొత్త సినిమా టికెట్ రేట్లకే యూట్యూబ్ లో ఉచితంగా దొరికే వాటిని పదే పదే చూడమంటే మా వల్ల కాదనేస్తున్నారు. దెబ్బకు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉదయం షోలకు తప్ప మిగిలిన చోట్ల స్పందన అంతంత మాత్రంగా ఉంది. ప్రభాస్ పుట్టినరోజుకి బోలెడు అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. వాటిని చూసుకుంటూ ఇళ్లలో పండగ చేసుకుంటూ ఫ్యాన్స్ బిజీగా ఉంటారు. ఇలాంటి టైంలో ఛత్రపతిని మళ్ళీ చూడమంటే కష్టం. మరి అభిమానులు కూడబలుక్కుని థియేటర్లని నింపేసి కొత్త రికార్డులు ఇవ్వడం అనుమానమే.