అలాంటి టాక్‌తో ఇలాంటి వసూళ్లా?

ఈ గురువారం రిలీజైన ‘లియో’ సినిమాకు తెలుగులో బ్యాడ్ టాక్ వచ్చింది. తమిళంలో కూడా ఈ సినిమాకు డివైడ్ టాకే వచ్చింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనడంలో సందేహమే లేదు. లోకేష్ నుంచి ప్రేక్షకులు ఆశించిన దానికి.. సినిమాలో ఉన్న కంటెంట్‌కు పొంతనే లేదు. అసలీ సినిమాలో ఒక ఒరిజినాలిటీ కనిపించలేదు. ‘బాషా’ రోజుల నుంచి చూస్తున్న పాయింట్‌నే అటు ఇటు తిప్పి సినిమా లాగించేశాడు లోకేష్.

హీరో సహా ఏ పాత్రనూ సరిగా డిజైన్ చేయని లోకేష్.. కేవలం తన స్టైలిష్ టేకింగ్‌తో అలా అలా సినిమాను లాగించేశాడు. విజువల్‌గా సినిమా బాగుంది అన్న మాటే తప్ప చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేని సినిమా ఇది. ఐతే సిినిమాలో విషయం లేకున్నా, టాక్ బాలేకున్నా ఈ సినిమా వసూళ్లకు మాత్రం ఢోకా లేదు. సినిమాకు ముందు నుంచే హైప్ ఉంది కాబట్టి తొలి రోజు హాళ్లు నిండడంలో, భారీ వసూళ్లు రావడంలో ఆశ్చర్యం లేదు.

కానీ రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీతో నడిచింది ‘లియో’. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. శుక్రవారం కూడా హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉదయం 8 గంటల షోలు నడిచాయి. ‘భగవంత్ కేసరి’తో పాటు ‘టైగర్ నాగేశ్వరరావు’తోనూ పోటీ ఉన్నప్పటికీ.. ‘లియో’కు పెద్ద ఎత్తునే స్క్రీన్లు, షోలు కొనసాగాయి. వాటిలో ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఇలాంటి బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మామూలుగా రెండో రోజుకు చల్లబడిపోతుంటాయి.

అందులోనూ అనువాద చిత్రాలకు నెగెటివ్ టాక్ మరింత మైనస్ అవుతుంటుంది. పోటీలో పేరున్న తెలుగు సినిమాలుంటే.. డబ్బింగ్ మూవీ పట్ల ఆసక్తి ఉండదు. ఎగ్జిబిటర్లు కూడా స్క్రీన్లు, షోలు బాగా తగ్గించేస్తారు. కానీ ‘లియో’ విషయంలో అలా జరగట్లేదు. థియేటర్లకు జనం వస్తున్నారు. ఆక్యుపెన్సీలు బాగున్నాయి. పెద్ద సంఖ్యలో స్క్రీన్లు, షోలు కొనసాగుతున్నాయి. వీకెండ్ వరకు ఈ సినిమా మంచి వసూళ్లే సాధించేలా ఉంది. అప్పటి వరకు బాగా ఆడినా బయ్యర్లకు మంచి లాభాలే వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.