దసరా కానుకగా గురువారం రిలీజైన నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి మంచి టాకే తెచ్చుకుంది. ఇదే సీజన్లో రిలీజైన మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే బెటర్ టాక్ రావడం భగవంత్ కేసరికి కలిసొచ్చేదే. తొలి రోజు ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి ఈ సినిమాకు వసూళ్లు మెరుగయ్యాయి. వీకెండ్లో ఈ చిత్రం బంపర్ కలెక్షన్లు తెచ్చుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీం సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఇందులో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. దసరా రోజు నుంచి సినిమాలో కొత్త పాట కలిపే విషయంలో సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పడం విశేషం. దంచవే మేనత్త కూతురా బిట్ సాంగ్ కలిసిన ఒక పాటను దసరా రోజు సినిమాలో కలుపుతామని అతను ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రెగ్యులర్ మాస్ సాంగ్స్ ఉంటే ఫ్లో దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో. దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు అనిల్ వెల్లడించాడు. కథ ప్రధానంగా సాగే సినిమాను ప్రేక్షకులు కొన్ని రోజుల పాటు జెన్యూన్‌గా చూడాలని.. ఆ తర్వాత అభిమానుల కోసం ఆ పాటను కలుపుతామని అన్నాడు అనిల్. ఐతే ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక పాట కలపాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.
పాట లేకుండానే సినిమా బాగుందని అంటున్నారని.. అసలు ఆ పాటను ఎక్కడ కలపాలో కూడా అర్థం కావడం లేదని.. సరైన సిచువేషన్ కుదరట్లేదని అనిల్ అన్నాడు. తన టీంతో కలిసి మాట్లాడుకుని.. పాట కలపాలా వద్దా అనే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ తెలిపాడు. మరోవైపు సినిమాలో శ్రీలీల నుంచి ఆశించే డ్యాన్స్, గ్లామర్ షో లేదని రివ్యూల్లో పేర్కొనడాన్ని అనిల్ తప్పుబట్టాడు. ఒక ఫోబియా ఉన్న.. మిలిటరీకి ప్రిపేరయ్యే అమ్మాయి పాత్ర నుంచి అలా ఎలా ఆలోచిస్తారని.. అలా ఆలోచించేవారి మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అనిల్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.