‘లియో’ సినిమాకు విడుదల ముంగిట వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. ప్రేక్షకుల్లో ఎంతమాత్రం హైప్ తగ్గలేదు. ఎగబడి టికెట్లు కొన్నారు. తెలుగులో అయితే బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’ కంటే జోరుగా దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అన్ని ప్రధాన సిటీల్లోనూ ఉదయం 7-8 గంటలకే షోలు పడ్డాయి. కానీ ఆ షోలు చూసి బయటికి వస్తున్న జనం ముఖాలు చూస్తే సినిమా ఎలా ఉందో అర్థమైపోయింది.
సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా పెద్ద హిట్టయ్యేది కానీ.. పూర్తిగా నిరాశపరచడంతో వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ ప్రభావం శుక్రవారం వసూళ్లపై బాగానే పడేలా ఉంది. తమిళనాట కూడా ‘లియో’కు ఏమంత మంచి టాక్ లేదు. అక్కడ కూడా సినిమా డౌన్ అయ్యేలాగే కనిపిస్తోంది. నెగెటివ్ టాకే పెద్ద సమస్య అనుకుంటుంటే.. దాన్ని మించిన షాక్ ‘లియో’ టీంకు తగిలింది.
‘లియో’కు తమిళనాడులో షోలు పడే సమయానికే పైరసీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ చాలా చోట్ల ప్రిమియర్స్ పడ్డాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రికే షోలు మొదలైపోయాయి. అందులోంచే సినిమాను పైరసీ చేసి నెట్లో పెట్టేసింది ఒక పైరసీ వెబ్ సైట్. ముందే హెచ్చరించి మరీ కొత్త సినిమాలను పైరసీ చేసి రిలీజ్ చేయడం ఆ వెబ్ సైట్‌కు అలవాటు.
ఆ సైట్ వాళ్లే సినిమాను ఆన్ లైన్లో లీక్ చేసినట్లు తెలుస్తోంది. వేగంగా పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం ‘లియో’ టీం చేస్తున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అడ్డుకోవడం కష్టమే. అసలే నెగెటివ్ టాక్ వల్ల ప్రేక్షకులు మున్ముందు థియేటర్లకు రావడం కష్టంగా ఉంది. దీనికి తోడు ఇప్పుడు పైరసీ ప్రింట్ కూడా బయటికి రావడంతో సినిమాకు మరింత పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే. వీకెండ్ తర్వాత సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.