ఖరీదైన బంగారం దొంగ ‘జపాన్’

యుగానికి ఒక్కడు లాంటి విలక్షణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ త్వరలో జపాన్ గా రాబోతున్నాడు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినా స్వంత టాలెంట్ తో ఎదుగుతున్న ఈ విలక్షణ హీరోకు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. స్వంత డబ్బింగ్ తనే చెప్పుకోవడం ఇతని మరో టాలెంట్. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హీస్ట్ థ్రిల్లర్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న జపాన్ దీపావళి కానుకగా సల్మాన్ ఖాన్ టైగర్ 3తో పోటీ పడేందుకు సిద్ధ పడుతోంది. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు.

జపాన్(కార్తీ)కేవలం బంగారం మాత్రమే దోచుకుపోయే ఘరానా దొంగ. నగరం నడిబొడ్డులో ఒక జ్యువెలరీ షాప్ లోకి దూరి రెండు వందల కోట్ల సొత్తు కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసురుతాడు. నూటా యాభైకి పైగా కేసులున్నా సరే దొరక్కుండా తప్పించుకు తిరుగుతాడు. జపాన్ ని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్(సునీల్)కి ఇదంతా చిక్కుముడిగా ఉంటుంది. ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలన్న సంకల్పంతో ఓ వ్యూహం పన్నుతాడు. అయితే దేశ విదేశాలకు తిరిగే అలవాటున్న జపాన్ కు ప్రియురాలు(అను ఇమ్మానియేల్)కూడా ఉంటుంది. తర్వాత ఏమైందో సినిమాలో చూడాలి.

విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఖరీదైన దొంగగా కార్తీ బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంది. ఇంతకు ముందు చేసిన పొన్నియిన్ సెల్వన్, సర్దార్ లతో పోలిక లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్ ని ఎంచుకున్నాడు. నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. క్యాస్టింగ్ ని ఎక్కువగా రివీల్ చేయలేదు. బట్టతలతో సునీల్ విభిన్నంగా ఉన్నాడు. చాలా గ్యాప్ తర్వాత అను ఇమ్మానియేల్ దర్శనమిచ్చింది. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని జపాన్ డబ్బింగ్ వెర్షన్ కు డిమాండ్ బాగానే ఉంది. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ నవంబర్ 10న రావొచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం.