రచ్చ రంబోలా చేసే ‘కీడా కోలా’

పెళ్లి చూపులతో దర్శకుడిగా డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చేసింది ఈ నగరానికి ఏమైంది ఒకటే. ఇది కూడా కల్ట్ స్టేటస్ దక్కించుకుని అయిదేళ్ల తర్వాత రీ రిలీజ్ అయితే అసలు టైంలో కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. తర్వాత నటుడిగా నిర్మాతగా యాంకర్ గా కొంత బిజీ అయిపోయిన తరుణ్ చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ చేపట్టి తీసిన మూవీ కీడా కోలా. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నలుగురు నిర్మాతలు కలిసిన ప్రొడ్యూస్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలున్నాయి. మూడు నిమిషాల ట్రైలర్ ని ఇవాళ హైదరాబాద్ ఈవెంట్ లో లాంచ్ చేశారు.

సరైన ఉద్యోగం లేని ఇద్దరు యువకులు(చైతన్య రావు-రాగ్ మయూర్). ఒకడేమో లాయర్. మరొకడికి పైకి చెప్పుకోలేని విచిత్రమైన జబ్బు వల్ల కోటి రూపాయల బొమ్మని దేనికి పనికిరాకుండా చేసి కోర్టు దాకా వెళ్తాడు. మరోవైపు రాజకీయంగా ఎదగాలని చూస్తున్న చోటా గల్లీ లీడర్ (జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా పార్టీ నాయకుడిని హత్య చేసేందుకు జైలు నుంచి బయటికి వచ్చిన నాయుడు(తరుణ్ భాస్కర్)కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో ఓ కంపెనీ సిఈఓ(రవీంద్ర విజయ్) రంగంలో దిగుతాడు. ఈ రచ్చ రంబోలాకి మరో పెద్ద మనిషి(బ్రహ్మానందం)కి కనెక్షన్ ఏంటో తెరమీద చూడాలి

టిపికల్ స్క్రీన్ ప్లేతో, తెరనిండా పాత్రలతో తరుణ్ భాస్కర్ చాలా క్రేజీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. క్రైమ్,. కామెడీ, రివెంజ్ అన్నీ మిక్స్ చేస్తూ లవ్, రొమాన్స్ జోలికి వెళ్లకుండా ఒక డిఫరెంట్ జానర్ ని సృష్టించినట్టు అనిపిస్తోంది. కోలా సీసాలో పడిన బొద్దింక చుట్టూ ఏదో రహస్యం పెట్టేసి దాని చుట్టే కథను అల్లిన వైనం వెరైటీగా ఉంది. క్యాస్టింగ్ చాలా పెద్దదే సెట్ చేసుకున్నారు. వివేక్ సాగర్ సంగీతం, ఆరోన్ ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ యూత్ ఫుల్ యాక్షన్ డ్రామా నవంబర్ 3న థియేటర్లలో అడుగు పెట్టనుంది. టార్గెట్ కి సరిగ్గా కనెక్ట్ అయితే తరుణ్ భాస్కర్ జేబులో బ్లాక్ బస్టర్ పడ్డట్టే.