సినిమాటిక్ యునివర్స్ ఎలా ఉండబోతోంది

రేపు విడుదల కాబోతున్న లియో మూవీ లోకేష్ కనగరాజ్ సృష్టిస్తున్న సినిమాటిక్ యునివర్స్ లో భాగమేనని క్లారిటీ రావడంతో అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చేసింది.  శుభాకాంక్షలు చెబుతూ ఉదయనిధి స్టాలిన్ పెట్టిన ట్వీట్ లో ఇదే అర్థం రావడంతో ఫ్యాన్స్ డౌట్లు తీరిపోయాయి. అయితే లియోకి ఇంకా బాగా కనెక్ట్ కావాలంటే విక్రమ్ ని మరోసారి చూడాలనే తరహాలో చెన్నై మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే కొద్దిరోజుల క్రితం నుంచి డిస్నీ హాట్ స్టార్ లో దీన్ని ఫ్రీ స్ట్రీమింగ్ లో ఉంచారు. అంటే ఎలాంటి చందా కట్టకుండానే ఉచితంగా చూసేయొచ్చన్న మాట.

ఇది లియో క్రేజ్ ని వాడుకోవడం కోసమా లేక ప్రమోట్ చేయడం కోసమా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. రేపటి దాకా ఆగాల్సిందే. ఒక్క రజనీకాంత్, ప్రభాస్ తో చేయబోయే సినిమాలు తప్ప అన్నీ ఒకదానికి మరొకటి ముడిపడిన యునివర్లోనే ఉంటాయని లోకేష్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో లియోలో ఎవరి క్యామియో ఉంటుందనే సస్పెన్స్ పీక్స్ కి చేరుకుంటోంది. రామ్ చరణ్ లేడని స్పష్టంగా తెలుస్తున్నా ఇంకొందరు అభిమానులు నమ్మడం లేదు. స్క్రీన్ మీద తమకు తాము నిర్ధారించుకుంటే తప్ప శాంతించేలా లేరు. కేవలం ఈ ఒక్క పుకారు బుకింగ్స్ మీద పాజిటివ్ గా పని చేసింది.

రేపటి యుఎస్ ప్రీమియర్లతో మొదలుకుని తెలుగు రాష్ట్రాల టాక్ దాకా తమిళ తంబీలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఆలస్యంగా ఉదయం 9 గంటలకు చూసేది వాళ్లే కాబట్టి ఈలోగా టాక్ పూర్తిగా బయటికి వచ్చేసి ఉంటుంది. కీలక ట్విస్టులు, సన్నివేశాలు థియేటర్ వీడియో రూపంలో వద్దన్నా ట్విట్టర్ లో పెట్టేస్తారు. ఇదంతా పక్కనపెడితే విక్రమ్ కు దీనికి ఒకవేళ నిజంగా కనెక్షన్ ఉండే పనైతే మాత్రం కమల్ హాసన్ లేదా కార్తీ క్యామియో చూసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూస్తుంటే కొత్త తరం దర్శకులలో అధిక శాతం సినిమాటిక్ యునివర్స్ దారి పట్టేలా ఉన్నారు.