ప్రాణ స్నేహితుల యుద్ధమే సలార్ కథా

రెండు నెలలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న డిసెంబర్ 22 ఎంతో దూరం లేదు. సలార్ విడుదల కోసం హోంబాలే సంస్థ ఆఘమేఘాల మీద బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తోంది. అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా టీజర్ లాంటిది వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ కోరిక నెరవేరే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఒక పోస్టర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. లేదూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే తప్ప బర్త్ డేకి ఎలాంటి అద్భుతం ఉండకపోవచ్చు.

ఇదిలా ఉంచితే సలార్ కథకు సంబంధించిన కొన్ని లీక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటి ప్రకారం ఇందులో సలార్, దేవా తండ్రి కొడుకుల పాత్రలు ప్రభాస్ చేస్తున్నాడు. రాజ మన్నార్ గా జగపతిబాబు అతని వారసుడు వరదరాజ మన్నార్ గా పృథ్విరాజ్ సుకుమార్ కనిపిస్తారు. ట్విస్టు ఏంటంటే దేవా, వరదరాజ ప్రాణ స్నేహితులు. అయితే సలార్ సామ్రాజ్యానికి తూట్లు పడేందుకు కారణమైన గ్యాంగ్  గురించి తెలుసుకున్న దేవా వాళ్ళ నాయకుడు ఫ్రెండేనని తెలుసుకుని నిర్ఘాంతపోయి ఒక్కసారిగా విశ్వరూపం చూపించడమే స్టోరీలోని మెయిన్ పాయింటని ఇన్ సైడ్ టాక్.

కాకపోతే మొదటి భాగంలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అసలైన సలార్ బాహుబలి లాగా రెండో పార్ట్ లోనే వస్తాడనే టాక్ ఉంది. అయితే అక్కడ తండ్రి పాత్ర చనిపోయినట్టు కాకుండా ఇందులో ఇద్దరు ప్రభాస్ లను ఒకేసారి చూసే ఛాన్స్ కూడా ఉందని పలువురు చెబుతున్న మాట. వీటిలో నిజానిజాలు నిర్ధారణ కావాలంటే కనీసం ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు కానీ అది ఎప్పుడనేది మాత్రం ఇప్పటికి సస్పెన్సే. నవంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్లలో పాల్గొనేలా ప్రభాస్ తన డేట్లను ఖాళీగా ఉంచుకోబోతున్నట్టు సమాచారం.