రానా నాయుడు 2 వివాదం – వెంకీ కామెంట్స్

ఇవాళ హైదరాబాద్ లో జరిగిన సైంధ‌వ్‌ టీజర్ లాంచ్ ఈవెంట్ లో వెంకటేష్ రానా నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు. రెండో సీజన్ ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే తెలుగు ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి మసాల, బూతులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. నార్త్ లో మాత్రం బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారని, మొన్న అహ్మదాబాద్ మ్యాచ్ కు వెళ్ళినప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ గుర్తుపట్టి నాగా నాగా అని అరిచారని, సక్సెస్ అయ్యిందని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదని కుండబద్దలు కొట్టేశారు.

వెంకీ మాటల్లో ఒకటి స్పష్టంగా అర్థమయ్యింది. రానా నాయుడులో ఉన్న ఓవర్ బోల్డ్ కంటెంట్ కుటుంబ ప్రేక్షకులకు నెగటివ్ గా వెళ్లిందన్న వాస్తవం ఆయన మర్చిపోలేదు. తన బలంగా నిలిచే ఆ వర్గాన్ని మళ్ళీ అసంతృప్తికి గురి చేయడం భావ్యం కాదని భావించి ఆ మేరకు దర్శక రచయితలకు సూచించాననే అర్థం వెంకటేష్ మాటల్లో గోచరించింది. ఎలాగూ చూస్తున్నారు కదా మళ్ళీ రిపీట్ చేస్తానని అనలేదు. ఖచ్చితంగా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా రానా నాయుడు 2లో ఘాటుదనం తగ్గుతుందని మాత్రం చక్కగా స్పష్టం చేశారు.

ఇంతే కాదు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు తన కోసం స్క్రిప్ట్ లు సిద్ధం చేయడం, వాటిలో నటించే అవకాశాన్ని ధృవీకరించడం ద్వారా వెంకటేష్ తాను పూర్తిగా డిజిటల్ కు దూరం కావడం లేదని చెప్పేశారు. సైంధ‌వ్‌ ఈవెంట్ కి విచ్చేసిన అభిమానుల సాక్షిగా ఓపెన్ గానే మాట్లాడారు. అయితే రానా నాయుడు 2 షూటింగ్ ఏ దశలో ఉందనే సమాచారం బయటికి రావడం లేదు. సైంధ‌వ్‌ జరిగినన్ని రోజులు వెంకీ పూర్తిగా దీనికే అంకితమైపోయారు. సో బహుశా డిసెంబర్ నుంచి నాగా నాయుడు గెటప్ లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. నారప్ప, దృశ్యం 2 తర్వాత మరిన్ని ఓటిటి మూవీస్ ని వెంకీ నుంచి ఆశించవచ్చు.