స్టార్ హీరోలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉన్నా అవి ఎంత కరెక్టో భవిష్యత్తు ఋజువు చేస్తుంది. ఇటీవలే ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఓపెన్ డిబేట్ లో పాల్గొన్న సీనియర్ నటి సుహాసిని ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ ని తన భర్త మణిరత్నం తొలుత ఒక భాగంగా కమల్ హాసన్ తో ప్లాన్ చేశారట. కానీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మహేష్ బాబు, విజయ్ లను పెట్టి మల్టీ స్టారర్ గా తీస్తే ప్యాన్ ఇండియా లెవల్ లో భారీ క్రేజ్ వస్తుందని ఇద్దరినీ అడిగారు. కానీ డేట్స్ సమస్యతో పాటు సంక్లిష్టంగా అనిపించే సబ్జెక్టుని ఇష్టం లేకపోయినా వదులుకున్నారు.
అలా అది వాళ్ళ నుంచి జయం రవి, చియాన్ విక్రమ్ కు వెళ్ళింది. చెప్పాలంటే మహేష్ భేషనిపించే డెసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ పొన్నియిన్ సెల్వన్ చేసుంటే బిజినెస్ పరంగా దానికి విపరీతమైన క్రేజ్ వచ్చి కోట్ల రూపాయలు వెల్లువగా తెచ్చి పెట్టేది కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కేది కాదు. తమిళనాడులో తప్ప పిఎస్ రెండు భాగాలు బయట పెద్దగా ఆడలేదు. తెలుగు రాష్ట్రాల్లో కొంత నయం. చావు తప్పి కన్ను లొట్టపోయింది కానీ మరీ భారీ నష్టాలు మిగల్చలేదు. బాహుబలి దాటేస్తుందనుకున్న కోలీవుడ్ మూవీ లవర్స్ కలలు కలలుగానే మిగిలిపోయాయి.
దీన్ని బట్టి మహేష్ బాబు కొన్నిసార్లు చేసే ఆలస్యాలు మంచికే అనిపిస్తాయి. గుంటూరు కారం విషయంలోనూ అంత పట్టుదలగా ఉన్నాడు కాబట్టే క్యాస్టింగ్ మొదలుపెట్టి మ్యూజిక్ దాకా బెస్ట్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కష్టపడుతోంది. ఒకవేళ అన్నింటికీ ఎస్ చెప్పుకుంటూ పోయి ఉంటే ఈపాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోయేవి. రాజమౌళి కోసం రెడీ అవుతున్న మహేష్ దాని రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దాన్ని బట్టి తన ప్లానింగ్ ని సిద్ధం చేసుకోబోతున్నాడు. దీనికన్నా ముందు వేగంగా ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారం ఉంది కానీ ఖరారుగా తెలియాల్సి ఉంది.