ఆగస్టులో విడుదలై గదర్ 2 లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ని తట్టుకుని మరీ ఘనవిజయం సాధించిన ఓ మై గాడ్ 2 తెలుగు రీమేక్ కోసం ఒకరిద్దరు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలు ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతున్నాయి. ఎందుకంటే మొదటి భాగానికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ పార్ట్ రీమేక్ చేసిన గోపాల గోపాల ఇటు వెంకటేష్, అటు పవన్ కళ్యాణ్ లకు సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది. కానీ ఓఎంజి 2 అలా ఉండదు. పిల్లలకు సంబంధించిన చాలా సున్నితమైన శృంగార ఆలోచనల చుట్టూ, సమాజాన్ని స్కూళ్లను ఆలోచింపజేసేలా అసభ్యత లేకుండా రూపొందించారు.
ఇది తెలుగు ఆడియన్స్ అంగీకరించేంత కంటెంట్ అయితే కాదు. మనకున్న మల్టీప్లెక్స్ ఆడియన్స్ రీచ్ తక్కువ. వాటికి వచ్చే వాళ్లలో కూడా అధిక శాతం మాస్ జనాలు, సగటు మధ్య తరగతి కుటుంబ ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళను క్లాస్ సబ్జెక్టుతో మెప్పించడం అంత సులభం కాదు. అసలు హిందీలోనే బోలెడు సెన్సార్ కట్లు, అభ్యంతరాలతో ఓఎం2 బయట పడింది. దేశవ్యాప్తంగా మార్కెట్ పరిథిలో వర్కౌట్ అయ్యింది కానీ కేవలం టాలీవుడ్ పబ్లిక్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీస్తే రిస్క్ ఉంటుంది. పైగా పంకజ్ త్రిపాఠి పాత్రకున్నంత స్పేస్ అక్షయ్ కుమార్ కు ఉండదు.
మరో మైనస్ ఏంటంటే ఓ మై గాడ్ 2 సుదీర్ఘమైన కోర్టు సంభాషణలతో నడుస్తుంది. సగం పైగా ఆ డ్రామానే. కాకపోతే సెక్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పలు వాస్తవాలను కూలంకుషంగా చర్చిస్తారు. వాటిని యధాతధంగా తెలుగులో తీయడం కష్టం. వెంకటేష్ ఒప్పుకున్నా అక్షయ్ పాత్రకు పవన్ అంతగా సెట్ కారు. నిడివి తక్కువ కాబట్టి తొందరగా పూర్తి చేయొచ్చు కానీ వేరే హీరోతో చేస్తేనే బెటర్. అయినా హక్కుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓఎంజి 2 మన నేటివిటీ సూట్ కాని కథని అర్థమైపోతుంది. అయినా సరే మొండిగా ముందుకెళ్తే ఆ రిస్క్ కి ఎవరు మాత్రం బాధ్యులు.