ఎప్పుడో 2006లో వచ్చిన బొమ్మరిల్లుకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సిద్దార్థ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ వస్తున్నాయంటే దానికి కారణం ఈ ఫ్యామిలి ఎంటర్ టైనరే. దర్శకుడు భాస్కర్ కి ఇంటి పేరుగా మారిపోయి, దేవిశ్రీ ప్రసాద్ కు గొప్ప బ్రేక్ ఇచ్చి, నిర్మాత దిల్ రాజుకు కనక వర్షం కురిపించిన ఈ చిత్రం గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పినా తరిగిపోయేది కాదు. ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది హీరోయిన్ జెనీలియా దేశముఖ్. అల్లరి పిల్ల హాసినిగా ఆ అమ్మాయి చేసిన సందడి కుర్రాళ్ళ మనసులో బలంగా ముద్రించుకుపోయింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే దశాబ్దంన్నర తర్వాత కూడా జెనీలియాకు అవకాశాలు వస్తున్నాయి. ఆ మధ్య భర్త రితేష్ తో కలిసి చేసిన మజిలీ మరాఠి రీమేక్ వేద్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. క్రమం తప్పకుండ వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. నచ్చిన వాటిని చేస్తోంది. ఇప్పుడో బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఏకంగా అమీర్ ఖాన్ సరసన జోడీ కట్టబోతోంది. లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని అమీర్ చేస్తున్న సితారే జమీన్ పర్ లో దర్శకుడు ఆర్ ఎస్ ప్రసన్న జెనీలియానే కోరుకున్నట్టు బాలీవుడ్ రిపోర్ట్. హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ కి రీమేక్ గా ఇది రూపొందనుంది.
మిడిల్ ఏజ్ దాటాక ఇలాంటి ఛాన్సులు రావడం విశేషమే. తెలుగులోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుతున్నా జెనీలియా వాటి మీద ఆసక్తి చూపించడం లేదు. భూమిక లాగా అక్క, వదిన, అత్త పాత్రలు చేయడం ఇష్టం లేక టాలీవుడ్ దర్శకులకు నో చెబుతోంది. 2012లో రానాతో నా ఇష్టం చేశాక తిరిగి తెలుగులో జెనీలియా కనిపించనే లేదు. వెంకటేష్, అల్లు అర్జున్, నితిన్, రామ్ లాంటి స్టార్లందరితో సూపర్ హిట్లు షేర్ చేసుకున్నఈ అమ్మడు ఇక్కడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. సితారే జమీన్ పర్ కూడా మానసికంగా ఇబ్బందులు పడుతూ పెద్ద స్థాయికి చేరుకునే చిన్న పిల్లల కాన్సెప్ట్ మీద రూపొందనుంది.