11 సినిమాల దండయాత్ర – ప్రేక్షకుల మౌనపాత్ర

మహర్షిలో ఇదే కథ ఇదే కథ పాట మన టాలీవుడ్ రిలీజులకు అన్వయించుకోవచ్చు. ఉంటే కరువు లేదంటే వరదలు అన్న రీతిలో కొన్ని శుక్రవారాలు అనాథలా వదిలేయడం లేదా ఒకేసారి మూకుమ్మడిగా ముప్పేటదాడి చేయడం నిత్య కృత్యంగా మారుతోంది. రేపటి బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. కేవలం తెలుగు వరకే చూసుకున్నా ఒకటి రెండు కాదు ఏకంగా 11 సినిమాలు, 1 రీ రిలీజ్ ప్రేక్షకులను కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఒక్కటంటే ఒక్కటి కనీస బజ్ ని మోయడం లేదు. బుకింగ్స్ సైతం చాలా నీరసంగా ఉన్నాయి.

వాటివైపు ఒక లుక్ వేస్తే రాక్షస కావ్యం, సగిలేటి కథ, తంతిరం చాప్టర్ 1, పెళ్ళెప్పుడు, మధురపూడి గ్రామం అనే నేను, నీలోనే నేను, మిస్టరీ, గుణసుందరి కథ, ఒక్కడే వన్ ఇవన్నీ రేపు వస్తుండగా ఒక రోజు అడ్వాన్స్ గా ఇవాళ మా ఊరి సిన్మాని విడుదల చేశారు. ఇవి కాకుండా జయం రవి నయనతార డబ్బింగ్ మూవీ గాడ్ తో పాటు రతి నిర్వేదంని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇన్నేసి గంపగుత్తగా వస్తున్నా దేని మీద ఆడియన్స్ కి కనీస ఆసక్తి లేదు. గత వారం కూడా ఆరేడు అదృష్టాన్ని పరీక్షించుకుంటే వాటిలో మ్యాడ్ ఒక్కటే గెలిచింది. అది కూడా సితార లాంటి బ్యానర్ ప్రోడక్ట్ కాబట్టి.

కానీ ఇప్పుడొచ్చే వాటికి అంత సీన్ లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప రేపు థియేటర్లలో జనం పెద్దగా ఉండరు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీప్లెక్స్ చైన్స్ అక్టోబర్ 13 నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని కేవలం 99 రూపాయలకే టికెట్లు అమ్ముతున్నాయి. కొన్ని స్నాక్స్ కూడా అంతే ధరలో ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీం వాటిని ఏమైనా కాపాడుతుందేమో చూడాలి. అయినా సరే రాణిగంజ్ లాంటి వాటికి బుకింగ్స్ బాగున్నాయి కానీ తక్కువ ధర అయినా చిన్న సినిమాల పట్ల జనం ఆసక్తి చూపించడం లేదు. అనూహ్యంగా వేటికైనా సర్ప్రైజ్ టాక్ వస్తే తప్ప ఈ సన్నివేశంలో పెద్ద మార్పు ఉండదు