ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా రిలీజ్ డేట్ కు ముందుగా స్పెషల్ ప్రీమియర్లు వేయడం ఈ మధ్య కాలంలో ట్రెండ్ గా మారిపోయింది. దీని వల్ల కొన్ని అద్భుత ఫలితాలు అందుకున్నాయి. బేబీ, సామజవరమన, మేజర్, చార్లీ 777, బలగం ఇలా పెద్ద లిస్ట్ ఉంది. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఇదే బాటలో నడిచారు. కొన్ని చోట్ల నిర్మాతలే థియేటర్ అద్దెలు కట్టి షోలు వేసుకోగా మరికొన్ని సెంటర్స్ లో డిస్ట్రిబ్యూటర్లు తమ స్వంత ఖర్చుల మీద అమ్ముడుపోని టికెట్లు ఏమైనా ఉంటే తెలిసినవాళ్లకు పంచి తద్వారా ఓపెనింగ్స్ కి మంచి బాటలు వేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు.
ఇప్పుడు రెండో సైడ్ చూద్దాం. ఈ ప్రీమియర్లకు వచ్చే ప్రశంసలు అన్ని వేళలా పని చేయడం లేదు. మంత్ అఫ్ మధుని సోషల్ మీడియాలో కొందరు ఆకాశానికికెత్తారు. కానీ టికెట్ కౌంటర్ల దగ్గర జనమే లేరు. మురళీధరన్ బయోపిక్ 800 క్రికెట్ చూడని వాళ్లకు కూడా కనెక్ట్ అవుతుందని ఊదరగొట్టారు. తీరా ఏమైంది. అదొచ్చిన సంగతే మాములు పబ్లిక్ కి తెలియనంతగా సైలెంట్ అయ్యింది. వ్యాక్సిన్ వార్ కి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అమెరికాలో నెల రోజుల ముందే షోలు వేసి తెగ భజన చేయించుకున్నాడు. కట్ చేస్తే రెండో రోజే చేతులు ఎత్తేసి బయ్యర్లకు చుక్కలు చూపించింది.
వీటికన్నా ముందు ఇంటింటి రామాయణం, రామన్న యూత్, హిడింబ, మిస్టర్ ప్రెగ్నెంట్, ఉస్తాద్, రంగబలి లాంటివెన్నో స్పెషల్ షోల పేరిట మీడియాని, ప్రేక్షకులను పిలిపించి గర్వంగా తమ సినిమాని ముందే చూపించాయి. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసినా ఫైనల్ గా గెలిచేది కంటెంట్ మాత్రమే. ప్రమోషన్ల కోసం ఇంత కష్టం ఏదైతే పడుతున్నారో దాన్ని స్క్రిప్ట్ దశలోనే పెట్టి ఉంటే బ్లాక్ బస్టర్లు పడటం తథ్యం. కాకపోతే ఈ సత్యం సరిగా గుర్తించడం లేదు. ఇది జరగనంత వరకు ఈ కథ రిపీట్ అవుతూనే ఉంటుంది.