అబ్బవరం.. వాళ్లను చూసి నేర్చుకోవాలి

కిరణ్ అబ్బవరం.. మూడేళ్ల కిందట చాలా ప్రామిసింగ్‌గా కనిపించిన యువ కథానాయకుడు. షార్ట్ ఫిలిమ్స్‌తో పేరు సంపాదించి, ‘రాజావారు రాణివారు’ సినిమాలో హీరోగా ఛాన్స్ అందుకుని.. ఓటీటీలో ఆ సినిమా రిలీజయ్యాక పాపులర్ అయ్యాక ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాను అన్నీ తానై నడిపించి దాంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు వచ్చిన ఓపెనింగ్స్ చూసి షాకైన నిర్మాతలు అతడికి వరుసబెట్టి అవకాశాలు ఇచ్చారు. కానీ ఛాన్స్ వచ్చింది కదా అని ప్రతి సినిమా చేసేయడంతో ఇప్పుడు మొత్తం ఫాలోయింగ్, మార్కెట్ అంతా దెబ్బ తీసుకుని క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డాడు కిరణ్.

ఆల్రెడీ సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్ లాంటి చిత్రాలతో బాగా దెబ్బ తిన్న అతణ్ని.. ‘రూల్స్ రంజన్’ ఇంకా కిందికి లాగేసింది. సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అనడానికి కిరణ్ రుజువులా నిలిచాడు. కిరణ్ లాగే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి సక్సెస్ అయిన కొందరు యువ కథానాయకులు.. ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అడివి శేష్ కెరీర్లో ఒక దశ వరకు ఎలా డక్కామొక్కీలు తిన్నాడో అందరికీ తెలుసు. కానీ ‘క్షణం’ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నాక జాగ్రత్తగా కెరీర్‌ను నిర్మించుకున్నాడు.

అవసరపడి సినిమాలు చేయకుండా.. ఒక్కో సినిమాకు బాగా టైం తీసుకుని, మంచి క్వాలిటీ చూపించాడు. ఈ రోజు అడివి శేష్ సినిమా అంటే చాలు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేంత నమ్మకం సాధించాడు. నవీన్ పొలిశెట్టిది కూడా దాదాపుగా ఇలాంటి స్టోరీనే. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ లీడ్ రోల్‌లో ఒక సినిమా చేయడం కోసం అతను ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ లాంటి చక్కటి సినిమాతో హీరోగా మంచి విజయాన్నందుకున్నాక అతనూ తొందరపడలేదు. జాగ్రత్తగా ‘జాతిరత్నాలు’; ‘మిస్ శెెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలు చేశాడు. అవీ మంచి విజయాలు సాధించి నవీన్‌కు మాంచి డిమాండ్ తెచ్చిపెట్టాయి.

వీళ్లతో పాటు అసలు సుహాస్ అనే చిన్న నటుడిని చూసి కూడా కిరణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తన లుక్స్‌కి హీరో ఏంటి అనుకుంటారు. కానీ తనకు సరిపడే, కంటెంట్ ఉన్న సినిమాలతో అతను మెప్పిస్తున్నాడు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో ప్రేక్షకులను నమ్మకం సంపాదించిన అతను.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’తోనూ మరో విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు. కొంచెం క్రేజ్ వచ్చింది కదా అని వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుని, సినిమాలు చుట్టేసి ప్రేక్షకుల మీదికి వదిలేస్తే.. ఎలా ఉంటుందో కిరణ్‌ ఒక ఉదాహరణగా నిలిచాడు. కనీసం ఇకనుంచైనా అతను కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే, కంటెంట్ ఉన్న సినిమాల మీద దృష్టిపెడితే మళ్లీ పుంజుకోవడానికి అవకాశముంటుంది.