ట్రైలర్ దెబ్బకు లీగల్ నోటీసులు

థియేటర్ లో వేసే ఏ కంటెంట్ అయినా అది పబ్లిక్ ఎగ్జిబిషన్ కిందకే వస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్ తీసుకుని మాత్రమే ప్రదర్శించాలి. ఏ మాత్రం అలసత్వం వహించినా చట్టపరమైన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్య నాగార్జున పుట్టినరోజుకి నా సామి రంగాని ఈ కారణంగా కేవలం ఆన్ లైన్ కే పరిమితం చేయాల్సి వస్తుంది. అయితే లియో విషయంలో కొందరు ఎగ్జిబిటర్లు చూపించిన అత్యుత్సాహం ఏకంగా లీగల్ నోటీసులు అందుకునేలా చేసింది. మూడు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ ని తమిళనాడులోని పలు థియేటర్లలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నేరుగా పబ్లిక్ స్క్రీనింగ్ చేశారు.

అందులో ఓ అభ్యంతకర పదం, హింసాత్మక దృశ్యాలు యధాతథంగా వచ్చేశాయి. ఇది కాస్తా సెన్సార్ బోర్డు దృష్టికి వెళ్ళింది. తమ అనుమతి లేకుండా ఎలా ప్రదర్శిస్తారని వివరణ కోరుతూ కోర్టు నోటీసులు పంపింది. దెబ్బకు షాక్ తిన్న యాజమాన్యాలు వివరణ ఎలా ఇవ్వాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నాయి. వేయలేదని తప్పించుకోవడానికి లేదు. ట్రైలర్ వేసిన టైంలో అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వాటినే సాక్ష్యాలుగా న్యాయస్థానం తీసుకోవడంతో థియేటర్ ఓనర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్స్ డిమాండ్ చేశారనో లేదా క్రేజ్ వస్తుందనో ముందు వెనుకా చూసుకోకుండా రెండు నిమిషాల ట్రైలర్లు వేస్తే ఇదిగో ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2 గంటల 45 నిమిషాల నిడివితో ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న లియోకి సంబంధించిన చాలా వార్తలు పుకార్ల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ క్యామియో మీద పెద్ద చర్చే జరుగుతోంది. యూనిట్ నుంచి వచ్చిన లీక్ టాక్ అదేమీ లేదని చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఉంటుందనే నమ్ముతున్నారు. ఇంకో తొమ్మిది రోజులు దాని సంగతేంటో కూడా తేలిపోతుంది.