అందంతో సంబంధం లేకుండా కేవలం టాలెంట్ తో నెగ్గుకొస్తున్న హీరో సుహాస్. కలర్ ఫోటో లాంటి అవార్డు విన్నింగ్ మూవీలో నటించడంతో పాటు రైటర్ పద్మభూషణ్ తో సోలో హీరోగా ఈ ఏడాదే మంచి హిట్టు అందుకున్నాడు. అవకాశం దొరికినప్పుడు హిట్ 2 ది సెకండ్ కేస్ లాంటి వాటిలో విలన్ గా నటించేందుకు కూడా వెనుకాడగలేదు. త్వరలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విలేజ్ డ్రామాకు వెంకటేష్ మహా సమర్పకుడు కాగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇందాకా టీజర్ వచ్చింది. అంబాజీపేటలో ఉండే మల్లిగాడు(సుహాస్) పనిచేసేది సెలూన్ షాప్ లో అయినా మంచోడు. ఊర్లో ఫంక్షన్లకు బ్రహ్మాండంగా బ్యాండ్ వాయించడంలో ముందుంటాడు. కాలేజీలో చదివే అమ్మాయి(శివాని)తో పరిచయం ప్రేమగా మారుతుంది. అంతా బాగుంటుందనుకున్న టైంలో ఊళ్ళో ఓ పెద్దమనిషి వల్ల గొడవలు తలెత్తుతాయి. తప్పు చేయని ఓ మహిళ(శరణ్య ప్రదీప్) కోసం మల్లిగాడు ఆ రొంపిలోకి దిగాల్సి వస్తుంది. అయితే వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోతుంది. చివరికి ఈ రచ్చ ఎక్కడికి దారి తీసిందనేది త్వరలో థియేటర్లలో చూడమంటున్నారు.
ఇది కూడా కాన్సెప్ట్ ని నమ్ముకున్న సినిమానే. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో దర్శకుడు దుశ్యంత్ కటికనేని చాలా సహజంగా తెరకెక్కించాడు. సుహాస్ ఎప్పటిలాగే అన్ని ఎమోషన్స్ ని పలికించగా ఇందులో ఏకంగా గుండు కొట్టించుకునే సాహసం కూడా చేశాడు. మాములుగా లవ్ స్టోరీస్ కి ఎక్కువ పేరున్న శేఖర్ చంద్ర ఈసారి డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆశ్చర్యపరిచాడు. పేరున్న ఆర్టిస్టులు ఎక్కువ లేకపోయినా క్వాలిటీ వచ్చేలా చూసుకున్నారు. ముఖ్యంగా మాస్ లో మంచి అంచనాలు నెలకొనేలా కట్ చేసిన తీరు బాగుంది. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ వచ్చే నెల ఉండే ఛాన్స్ ఎక్కువుంది