హర్షవర్ధన్.. ఈ పేరును సింగిల్‌గా చెబితే ఎవరిని తెలియకపోవచ్చు. కానీ ‘అమృతం’ హర్షవర్ధన్ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. సినిమాల్లో అప్పటికే నటించినా కూడా ఈ సీరియల్‌తో హర్షకు వచ్చిన పాపులారిటీనే వేరు. శివాజీ రాజా, నరేష్ సైతం అమృతంలో కొంత కాలం లీడ్ రోల్స్ చేసినా.. హర్ష వేసిన ముద్ర బలమైంది. అతను సుదీర్ఘ కాలం ఆ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సీరియల్‌లో కొన్ని ఎపిసోడ్లకు అతను రైటర్‌గా, దర్శకుడిగా సైతం పని చేశాడు.
ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’ సహా పలు సినిమాల్లోనూ నటుడిగా కూడా బలమైన ముద్ర వేశాడు. ఇక సినిమాల్లో రైటర్‌గా కూడా హర్ష తనదైన ముద్ర వేశాడు. ఇష్క్, మనం, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాల్లో రచయితగా అతడి పని తనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హర్షలో ఇంత టాలెంట్ ఉందా అనుకున్నారు. అంత హృద్యమైన మాటలు రాశాడు హర్ష. రచయితగా పని చేసిన చాలామంది అంతిమ లక్ష్యం దర్శకత్వమే. హర్ష కూడా అందుకు మినహాయింపు కాదు. అతను చాలా ఏళ్ల కిందటే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా తీశాడు.
తర్వాత దీనికి ‘గూగ్లీ’ అని పేరు కూడా మార్చారు. కానీ ఏళ్లు గడిచాయి కానీ.. ఎంతకీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. అది ఏమైందో తెలియదు. దీని గురించి నిరాశ చెందకుండా సుధీర్ బాబును హీరోగా పెట్టి ‘మామా మశ్చీంద్ర’ సినిమాను అనౌన్స్ చేస్తే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపించింది. సుధీర్ బాబును మూడు భిన్నమైన పాత్రల్లో చూపిస్తూ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా చేస్తున్న సంకేతాలు కనిపించాయి. ఒక దశ వరకు ఈ సినిమా మీద బాగానే క్యూరియాసిటీ ఉండేది ప్రేక్షకుల్లో. కానీ ఎందుకో ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.
నెమ్మదిగా సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇటీవలే ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ఇచ్చారు. చెప్పినట్లే అక్టోబరు 6న రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. రచయితగా అంత మంచి పని తనం చూపించిన హర్ష.. దర్శకుడిగా పూర్తిగా తేలిపోయాడు. అసలు ఇది ఏ జానరో చెప్పలేనంత గందరగోళంతో కథను ఎలా పడితే అలా నడిపించాడు. పాత్రల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సినిమా అంతా విపరీతమైన గందరగోళంతో నడిచింది. దర్శకుడిగా హర్ష మెరుపులేమీ కనిపించలేదు. రచయితగా హర్ష టాలెంట్ చూసి వావ్ అన్నవాళ్లు.. దర్శకుడిగా తను తీసిన సినిమా చూసి వామ్మో అంటున్నారిప్పుడు.