చరణ్ క్యామియో అనవసరంగా ఊహించుకోవద్దు

దసరాకు విడుదల కాబోతున్న లియోలో రామ్ చరణ్ క్యామియో ఉంటుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. సోషల్ మీడియాలో అభిమానులు ఒకటే ట్వీట్లు పెడుతూ తమ సంతోషాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేసుకుంటున్నారు. విక్రమ్ లో రోలెక్స్ లాగా చరణ్ కనిపించేది కాసేపే అయినా హై లెవెల్ హీరోయిజంతో అదరగొడతాడనే రేంజ్ లో తెగ ఊహించేసుకుంటున్నారు. అయితే విశ్వసనీయ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో చరణ్ క్యామియో లేదట. వేరే స్టార్ ఉన్న మాట వాస్తవమే కానీ అది ఖచ్చితంగా మెగా పవర్ స్టార్ కాదనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

సో ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుని తీరా థియేటర్లో చూసి నిరాశ చెందకుండా ముందే ప్రిపేర్ అయితే బెటర్. గతంలో జవాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. క్లైమాక్స్ లో విజయ్ ఎంట్రీతో దద్దరిల్లిపోతుందని ఏవేవో లీకులు వచ్చాయి. తీరా చూస్తే సంజయ్ దత్ వచ్చి తుస్సుమనిపించాడు. లియోలో కూడా ఫహద్ ఫాసిల్ లాంటి నటుడు ఉంటాడు తప్పించి మరీ చరణ్ రేంజ్ స్టార్ కాదనేది బలంగా వినిపిస్తున్న వెర్షన్. ఈ సస్పెన్స్ మహా అయితే ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది కానీ అప్పటిదాకా అభిమానుల ఎగ్జైట్ మెంట్ హద్దులు దాటకుంటే బెటర్.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా లోకేష్ కనగరాజ్ తమిళ మీడియాకు వరసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ కు లియో రీమేకనే వార్తలకు నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే నిర్మాతలు అధికారికంగా హక్కులు కొనేసి ఆ విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డారని చెన్నై న్యూస్. ఇది కూడా అక్టోబర్ 19నే తేలనుంది. రెండు షేడ్స్ లో విజయ్ నటించిన లియోని రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీశారని మరో ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ మీద మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో బయట పబ్లిసిటీ మాత్రం హైప్ ని అమాంతం పెంచేస్తోంది.