లియో.. అన్నీ థియేటర్లోనే

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ప్రేక్షకుల దృష్టంతా ‘లియో’ మూవీ మీదే ఉంది. తమిళ టాప్ స్టార్ విజయ్ హీరోగా ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి ఇంతకముందు రిలీజ్ చేసిన పోస్టర్లు, ఇతర ప్రోమోలు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించాయి. సినిమా మీద హైప్ ఇంకా పెంచాయి. తెలుగులో కూడా ‘లియో’కు మంచి హైప్ వచ్చింది.

దసరాకు ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ లాంటి భారీ చిత్రాలతో ‘లియో’ పోటీ పడుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ ద్వారా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఐతే మొన్నటిదాకా ఈ సినిమాకు సంబంధించి అంతా బాగానే నడిచింది కానీ.. ట్రైలర్ వచ్చాక ఉన్నట్లుండి నెగెటివిటీ మొదలైంది. ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం.. హాలీవుడ్ మూవీ ‘హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’కు కాపీ మూవీలా కనిపించడం.. అలాగే అందరూ ఆశించినట్లు ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ ఛాయలు పెద్దగా కనిపించకపోవడం నిరాశ కలిగించింది.

ఐతే దర్శకుడు లోకేష్ మాటల్ని బట్టి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాలోని మేజర్ హైలైట్ల గురించి ట్రైలర్లో చిన్న హింట్ కూడా ఇవ్వకుండా దాచి పెట్టినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ నిడివి మూడు నిమిషాల లోపే అని.. సినిమా రెండూ ముప్పావు గంటల నిడివితో ఉంటుందని.. అప్పుడే సినిమా గురించి ఒక అంచనాకు రావొద్దని అతనంటున్నాడు.

ఇది హాలీవుడ్ మూవీకి కాపీనా… ఎల్‌సీయూ ఛాయలు ఉంటాయా లేదా.. ఈ విషయాలన్నీ నేరుగా థియేటర్లోనే తెలుసుకోవాలని లోకేష్ అన్నాడు. ‘‘ఇది కూడా ఎల్‌సీయూలో భాగమా కాదా అనే విషయం ఇప్పుడే చెప్పేసినా సమస్యే. చెప్పకపోయినా సమస్యే. అలాగే మా చిత్రం ‘హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’కు కాపీ అని ముందు నుంచి అంటున్నారు. దాని గురించి కూడా నేను ఇప్పుడే మాట్లాడను. నేను ప్రేక్షకులు ఓపెన్ మైండ్‌తో థియేటర్లకు రావాలని కోరుకుంటున్నా. ఫ్రెష్‌గా సినిమా చూడాలనుకుంటున్నా. ఏదైనా సరే థియేటర్లలోనే చూసి తెలుసుకోవాలి’’ అని లోకేష్ స్పష్టం చేశాడు.