అన్న తడబడిన చోట తమ్ముడి గెలుపు

సరిపడా టాలెంట్ ఉన్నా, పెద్ద బ్యానర్లు అండగా నిలుస్తున్నా, ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నా హిట్టు కొట్టలేకపోతున్న సంతోష్ శోభన్ ని వెంటాడినంతగా దురదృష్టం ఎవరినీ తగులుకోలేదు. మారుతీ, నందిని రెడ్డి, మేర్లపాక గాంధీ లాంటి పేరున్న డైరెక్టర్లతో మొదలుపెట్టి కొత్తవాళ్ళ దాకా ఎవరితో చేయి కలుపుతున్నా హిట్టు దక్కడం లేదు. అలా అని అవకాశాలకు ఇప్పటికిప్పుడు లోటేం లేదు కానీ కెరీర్ గ్రాఫ్ ఊపందుకోకపోతే స్పీడ్ బ్రేకర్లు బండిని ఆపేయడం ఖాయం. సరే తన సంగతి ఎలా ఉన్నా తమ్ముడు సంగీత్ శోభన్ సుడి మాత్రం  డెబ్యూతోనే బాగున్నట్టు అర్థమైపోయింది.

నిన్న శుక్రవారం రిలీజుల్లో ఒక్క మ్యాడ్ మాత్రమే మంచి టాక్ తో దూసుకుపోతోంది. భీభత్సమైన వసూళ్లు కాదు కానీ పికప్ చాలా వేగంగా కనిపిస్తోంది. వీకెండ్ డామినేషన్ పూర్తిగా దాని చేతుల్లోనే ఉండబోయేది స్పష్టం. కంటెంట్ బాగున్నప్పటికీ క్యాస్టింగ్ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది మాత్రం సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్. బిగ్ స్క్రీన్ పరంగా ఇది తెరంగేట్రమే కానీ ఇంతకు ముందు జీ ఫైవ్ ఓటిటి సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో ఆల్రెడీ లాంచింగ్ అయిపోయింది. ఇదే సంస్థ నిర్మించిన ప్రేమ విమానం వచ్చే వారం స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

మ్యాడ్ లో దామోదర్ అలియాస్ డిడిగా కనిపించని అమ్మాయిని ఫోన్ లో ప్రేమించే యువకుడిగా, ఫ్రెండ్స్ బ్యాచ్ లో దూసుకుపోయే తత్వమున్న కుర్రాడిగా తన టైమింగ్ తో ఆ పాత్రను నిలబెట్టేశాడు. మరో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం సంగీత్ శోభనే. ఇతని ప్రధాన బలం కామెడీ. అప్పట్లో ఈవివి పెద్దబ్బాయి ఆర్యన్ రాజేష్ సక్సెస్ కాలేకపోతే తమ్ముడు అల్లరి నరేష్ స్టార్ కామెడీ హీరోగా సెటిలైపోయినట్టు ఇప్పుడీ సంగీత్ కు సరైన అవకాశాలు దొరికితే దూసుకుపోవచ్చు. పనిలో పనిగా అన్నయ్య సంతోష్ శోభన్ కూ ఒక బ్లాక్ బస్టర్ పడితే లెక్క సరిపోతుంది.