విపరీతమైన హైప్ మధ్య బయటికి వచ్చిన లియో ట్రైలర్ మీద సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ వినిపిస్తోంది. ఆశించిన స్థాయిలో లేదని, విక్రమ్ జైలర్ లను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టిన అనిరుద్ రవిచందర్ రేంజ్ లో బీజీఎమ్ వినిపించలేదని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గూస్ బంప్స్ ఇచ్చే షాట్స్ చూపించకుండా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సమస్య వచ్చి పడింది. వ్యూస్, లైక్స్, కామెంట్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి కానీ అసలు మ్యాటర్ మీద పెద్ద డిస్కషన్ జరుగుతోంది.
లియో 2005లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ నుంచి స్ఫూర్తి పొందిందని ముందు నుంచి లీకులు తిరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ లో చాలా సీన్లు ఆ స్టోరీ లైన్ కి దగ్గరగా కలుస్తున్నాయి. కాకపోతే మన స్టైల్ లో గ్యాంగ్ స్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి సంజయ్ దత్, అర్జున్ సర్జ పాత్రలతో కొంచెం డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు లోకేష్. పూర్తి సినిమా చూడకుండా నిర్ధారణలకు రాలేం కానీ ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా కనిపిస్తున్న ఫీడ్ బ్యాక్ మాత్రం ఒకింత ప్రతికూలంగానే ఉంది. లో ప్రొఫైల్ కోసం లోకేష్ ఇలా చేశాడా అనేది వేచి చూడాలి.
ఇదంతా ఎలా ఉన్నా లియో హైప్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. విడుదల నాటికి ఒక్కసారిగా అంచనాలు ఆకాశం తాకుతాయి. పైగా అక్టోబర్ 19కి ముందు రోజు సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్లు వేసేందుకు నిర్మాతలు సిద్ధపడుతున్నారంటే కంటెంట్ మీద ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా లోకేష్ కనగరాజ్ ట్రైలర్ ని కట్ చేయించడం ఒక ఎత్తుగడలా కనిపిస్తోంది. సైకో కిల్లర్, ఇద్దరు గ్యాంగ్ స్టర్లు, భయపడే తత్వమున్న హీరో, అతనిలాగే ఉండే మరొకడి దారుణమైన గతం ఇవి కాకుండా లియోలో బయటికి చెప్పని సర్ప్రైజ్ లు చాలా ఉన్నాయట. చూద్దాం.