కోట్లు ఖర్చు పెట్టిన మైదానం మూలకెళ్ళింది  

ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు విడుదల కష్టాలంటే అంత ఈజీగా నమ్మలేం. అందులోనూ వందల కోట్ల బ్యాకప్ ఉన్న బోనీ కపూర్ లాంటి నిర్మాత ఉన్నప్పుడు అదెలా సాధ్యమనే సందేహం రావడం సహజం. కానీ అజయ్ దేవగన్ నటించిన మైదాన్ విషయంలో ఇది ఋజువవుతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్ బయోపిక్ 2020లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఆగిపోయింది. తర్వాత మరుసటి ఏడాది ప్లాన్ చేసుకున్నారు. కుదరలేదు. ఒకదశలో ఆర్ఆర్ఆర్ పోటీగా పోస్టర్ కూడా వదిలారు. అయినా సాధ్యం కాలేదు. తీరా చూస్తే అసలెప్పుడు వస్తుందో అంతు చిక్కడం లేదు.

1952 నుంచి 62 మధ్య ఇండియన్ ఫుట్ బాల్ ని ప్రభావితం చేసిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా మైదాన్ రూపొందింది. మల్టీ లాంగ్వేజ్ లో ప్లాన్ చేసుకున్నారు. అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ప్రియమణి హీరో భార్య పాత్రను పోషించగా ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చారు. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకుని, రోజుకు 500 మందితో షూటింగ్ చేసేవారు. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిజంగానే వేశారు. తాజ్ నుంచి భోజన ఏర్పాట్లు జరిగేవి.

ఇంతా చేసినా మైదాన్ కు మోక్షం దక్కలేదు.  జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయిందని, ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదని బోనీ కపూర్ దీని గురించి అడిగిన మీడియా ముందు వాపోతున్నారు. అజిత్ తో తమిళంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు నిర్మించిన ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యమే. మరోపక్క అజయ్ దేవగన్ దీన్ని లైట్ తీసుకుని పట్టించుకోవడం మానేశారు. ఒక కీలక షెడ్యూల్ ముందు తుఫాను వచ్చి సెట్ నాశనం కావడం, ఇన్సురెన్స్ సొమ్ము రాకపోవడం మైదాన్ ని దెబ్బ కొట్టిందని యూనిట్ టాక్. చూస్తుంటే ఇది రావడం జరిగే పనిలా లేదు.