అనుకున్నదే అయింది. సెలవులు అవ్వగానే ‘స్కంద’ పనైపోయింది. గత గురువారం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. లాంగ్ అడ్వాంటేజీని బాగానే ఉపయోగించుకుంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ తర్వాత 2, 3 రోజుల్లో వసూళ్లు ఓ మోస్తరుగా రాగా.. ఆదివారంతో పాటు గాంధీ జయంతి సెలవైన సోమవారం కూడా సినిమాకు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి.
సోమవారం నాటికి వరల్డ్ వైడ్ షేర్ రూ.21 కోట్లను దాటగా.. ఎక్కువగా నెగెటివ్ టాకే తెచ్చుకున్న చిత్రానికి ఈ మాత్రం వసూళ్లు రావడం గొప్పే అనుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు కాబట్టి రెండో వీకెండ్ వరకు బండి లాగిస్తే బయ్యర్లు తక్కువ నష్టాలతో బయటపడతారని అనుకున్నారు. కానీ సోమవారం సెలవు రోజు అవ్వగానే ‘స్కంద’ బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిపోయింది. మంగళవారం మార్నింగ్ షోలకు జనం లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాాచరం.
సాయంత్రానికి కూడా వసూళ్లేమీ మెరుగుపడలేదు. ఆరో రోజు వరల్డ్ వైడ్ ‘స్కంద’ కేవలం రూ.35 లక్షల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇది చాలా నామామత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో సినిమాను నడిపించడానికి మెయింటైనెన్స్ మాత్రమే వచ్చినట్లు లెక్క. డిస్ట్రిబ్యూటర్లకు ఇందులో మిగిలేదేమీ లేదు. నైజాంలో తొలి రోజు తర్వాతి నుంచి అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా మంగళవారం రూ.10 లక్షల షేర్ మార్కును కూడా టచ్ చేయలేకపోయింది.
‘స్కంద’ ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టమని తేలిపోయింది. ఈ వీకెండ్లో వస్తున్నవన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ ‘స్కంద’ అడ్వాంటేజీని ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. రూ.42 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే స్థితిలో ఉన్న ఈ చిత్రం రూ.18-19 కోట్ల మధ్య బయ్యర్లకు నష్టం తెచ్చి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చుు.