ర‌జినీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు

జైల‌ర్ సినిమాతో త‌న బాక్సాఫీస్ స‌త్తా మ‌ళ్లీ అంద‌రికీ చూపించాడు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్. రోబో త‌ర్వాత నిఖార్స‌యిన హిట్ లేని ఆయ‌న‌కు జైల‌ర్ ఆశించిన దాని కంటే పెద్ద విజ‌యాన్నే అందించింది. యావ‌రేజ్ కంటెంట్‌తోనే సూప‌ర్ స్టార్ సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం చూసి అంద‌రూ షాక‌య్యారు. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఉత్సాహంగా త‌న కొత్త చిత్రానికి రెడీ అయిపోయాడు ర‌జినీ.

జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ త‌న కొత్త చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అగ్ర నిర్మాణ‌ సంస్థ‌ల్లో ఒక‌టైన లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిరిస్తోంది. ఈ సినిమా షూట్ మొద‌ల‌వుతున్న సంద‌ర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు వెల్ల‌డించింది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తుండ‌టం విశేషం.

అందులో ఒక‌రు మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టి మంజు వారియ‌ర్ కాగా.. మ‌రొక‌రు గురు ఫేమ్ రితికా సింగ్. వీరికి తోడు దుషారా విజ‌యన్ అనే మ‌రో అమ్మాయి కూడా న‌టిస్తోంది. ఐతే వీరిలో ఒక్క మంజు మాత్ర‌మే ర‌జినీకి జోడీ కావ‌చ్చ‌ని భావిస్తున్నారు. రితికా, దుషారాల‌వి క్యారెక్ట‌ర్ రోల్స్ అయి ఉండొచ్చు. చిన్న వ‌య‌స్కులైన వీళ్లిద్ద‌రూ ర‌జినీకి జోడీగా న‌టించే అవ‌కాశాలు లేవు. మంజు ఇంత‌కుముందు అసుర‌న్ మూవీలో ధ‌నుష్‌కు జోడీగా న‌టించ‌డం విశేషం.

ఇప్పుడు ఆయ‌న మామ ర‌జినీకి జోడీగా న‌టిస్తే అది విశేష‌మే అవుతుంది. జైల‌ర్ సినిమాను మ‌రో రేంజికి తీసుకెళ్లిన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌రే ఈ చిత్రానికి కూడా సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. జై భీమ్ త‌ర‌హాలోనే ఈ చిత్రం కూడా సామాజిక అంశాల నేప‌థ్యంలో న‌డుస్తుంద‌ట‌. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడు. తెలుగు నుంచి రానా కూడా ఒక కీ రోల్ చేస్తాడ‌ని వార్త‌లొస్తున్నాయి.