కిక్కు దేవ‌ర ఇస్తే.. ట్రెండింగ్‌లో వార్-2

ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా దేవ‌ర మూవీ మీదే ఉంది. సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఈ ఏడాది ఆరంభంలో దేవ‌ర సెట్స్ మీదికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ భారీగా ఉండ‌టం వ‌ల్ల‌, ఆచార్య త‌ర్వాత కొర‌టాల శివ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం వ‌ల్ల ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డంలో ఆల‌స్య‌మైంది. ఐతే మొద‌లైన ద‌గ్గ‌ర‌నుంచి ఎక్కువ‌గా విరామం లేకుండా షూటింగ్ చేస్తున్నారు. చ‌క‌చ‌కా షెడ్యూళ్లు అయిపోతున్నాయి.

అనుకున్న‌ట్లే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఒక భారీ అండ‌ర్ వాట‌ర్ యాక్ష‌న్ సీక్వెన్స్ తీసింది దేవ‌ర టీం. దీని గురించి సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. అది ఎన్టీఆర్ అభిమానుల‌కు గూస్ బంప్స్ ఇచ్చింది.

దీంతో దేవ‌ర ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవ‌డం మొద‌లుపెట్టింది. కానీ అంత‌లోనే ఆ హ్యాష్ ట్యాగ్‌ను వార్-2 డామినేట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఈ రోజంతా ట్విట్ట‌ర్లో ట్రెండింగ్ వార్-2నే. దీన్ని ట్రెండ్ చేస్తున్న‌ది బాలీవుడ్ వాళ్లు కాదు. ఎన్టీఆర్ అభిమానులే. అందుక్కార‌ణం వార్-2 గురించి అప్‌డేట్ బ‌య‌టికి రావ‌డ‌మే. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. దేవ‌ర సెట్స్‌లోనే అత‌ను ఎన్టీఆర్‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం.

అతి త్వ‌ర‌లోనే వార్-2 షూట్ మొద‌లువుతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ సినిమా ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా జరుగుతున్నాయి. తార‌క్‌కు త‌న పాత్ర‌, క‌థ గురించి కొంత బ్రీఫింగ్ ఇచ్చి షూట్ కోసం ప్రిపేర‌య్యేలా చేసేందుకే అయాన్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇంకో రెండు నెల‌ల్లో తార‌క్ దేవ‌ర షూట్ పూర్తి చేస్తాడని స‌మాచారం. ఆ వెంట‌నే వార్‌-2 మీదికి వెళ్లిపోతాడు. నేరుగా హిందీ మూవీ చేస్తూ హృతిక్ రోష‌న్‌తో అత‌ను స్క్రీన్ షేర్ చేసుకోబోతుండ‌టంతో తార‌క్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.