లారెన్స్ కంగనా రౌనత్ కాంబోతో పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 మీద క్రిటిక్స్ మాములుగా విరుచుకుపడలేదు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ రివ్యూ వస్తే ఒట్టు. ఒరిజినల్ వెర్షన్ కి సైతం టాక్ ఏమంత ఆశాజనకంగా లేదు. అయితే తమిళనాడులో మాత్రం మంచి వసూళ్లు నమోదు కావడం విచిత్రం. మొత్తం నాలుగు రోజుల వీకెండ్ కు గాను ఏకంగా ముప్పై కోట్ల గ్రాస్ దాటేసిందని కోలీవుడ్ ట్రేడ్ నుంచి వస్తున్న టాక్. లారెన్స్ మాస్ ఫాలోయింగ్, చంద్రముఖి బ్రాండ్ విలువ ఈ రెండూ పని చేసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూస్తున్నారని అర్థమవుతోంది.
ఇతర భాషల్లో మాత్రం ఈ సీక్వెల్ వాష్ అవుట్ అయిపోయింది. లెక్కలు బయటికి రావడం లేదు కానీ బ్రేక్ ఈవెన్ చేరుకోవడమే కష్టమనేలా ఉందని బయ్యర్లు చెబుతున్న మాట. మరి పక్క రాష్ట్రంలో ఆడేందుకు మరో కారణం కూడా ఉంది. పోటీగా వచ్చిన జయం రవి నయనతారల ఇరైవన్ కు దారుణమైన టాక్ వచ్చింది. విపరీతమైన హింసతో తీసిన సైకో కిల్లర్ కథని జనం నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో ఈ ప్రతికూల ఫలితం కాస్తా చంద్రముఖి 2కి కలిసి వచ్చింది. మనకు స్కంద సైతం బ్యాడ్ రిపోర్ట్స్ తోనూ సెలవుల పుణ్యమాని ఓ మోస్తరుగా లాగుతున్న సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా చూసిన సినిమాని తిరిగి స్పూఫ్ లాగా రీమేక్ చేసి చంద్రముఖికున్న పరువు పోయేలా తీసినా ఈ మాత్రం రిజల్ట్ దక్కడం పెద్ద షాక్. అయితే పి వాసు మూడో భాగం తీయకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన సిరీస్ లో చిన్న మార్పులు మినహాయించి క్లైమాక్స్ తో సహా మళ్ళీ మళ్ళీ ఒకటే కథను తెరకెక్కిస్తున్న ఈయన ఎన్ని పార్ట్స్ తీసినా సరే ఇదే రిపీట్ చేస్తారు తప్పించి కొత్తగా చూపించే ఛాన్స్ లేదు. అయినా ఇది చూశాక ఇంకో స్టార్ హీరో హీరో డేట్స్ ఇస్తాడనుకోలేం. ఏమో వెంకటేష్, లారెన్స్ లు ట్రాప్ లో పడ్డట్టు మరో హీరో దొరకడని గ్యారెంటీ ఏముంది.