ఒక్క ఓటుతో మారిన ‘కింగ్’ జాతకం

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర ఏర్పరుచుకున్న సంపూర్ణేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత టైటిల్ రోల్ చేసిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేలాకిది అఫీషియల్ రీమేక్. చాలా డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా కేరాఫ్ కంచెరపాలం ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. అక్టోబర్ 27 విడుదల కాబోతున్న మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ ఇవాళ లాంచ్ చేశారు. కథేంటో చెప్పేశారు.

తెలంగాణలో ఒక ఊరికి ఉత్తరం, దక్షిణమంటూ రెండు వర్గాలుగా విడిపోయి నిత్యం గొడవపడుతూ ఉంటారు. నాయకులు(నరేష్ – వెంకటేష్ మహా)గా వ్యవహరించే వాళ్లకు కనీసం ఒక పబ్లిక్ టాయిలెట్ తెచ్చే కెపాసిటీ కూడా ఉండదు. ఎవరో ఒకరు ప్రెసిడెంట్ అయితే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు రావని గుర్తించి ఎన్నికలకు సిద్ధపడతారు. ఓట్లు సమానంగా కనిపిస్తాయి. ఇంకొక్కటి అదనంగా వస్తే గెలుపు వాళ్లదే. దీంతో ఆ ఒక్క ఓటు కోసం ఎవరూ పట్టించుకుండా ఊళ్ళో చేతికొచ్చే పనులన్నీ చేసే మార్టిన్(సంపూర్ణేష్ బాబు)ని ప్రసన్నం చేసుకునే పని మొదలుపెడతారు. అక్కడి నుంచి ఈ కింగ్ జాతకం మారిపోతుంది.

ఒరిజినల్ వెర్షన్ ని యధాతథంగా తీసినట్టు అనిపిస్తోంది. పెద్దగా మార్పులేం చేయలేదు. యోగిబాబు కన్నా బెటర్ ఛాయస్ అనిపించేలా సంపూర్ణేష్ బాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఆర్టిస్టుల సెలక్షన్ బాగుంది. సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే సాగుతుంది. స్మరన్ సాయి సంగీతం సమకూర్చగా దీపక్ ఛాయాగ్రహణం నిర్వర్హించారు. వినోదం, సందేశం, ఎమోషన్ అన్నీ పుష్కలంగా ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం సవాలే. కంటెంట్ బాగుంటుంది కాబట్టి మన ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం సంపూ ఖాతాలో మరో హిట్టు పడ్డట్టే.