పవన్ ఫ్యాన్స్.. ఆశలు పెట్టుకోవద్దు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 2021లో ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. గత ఏడాది ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయించాడు. ఈ ఏడాది ‘బ్రో’తో ప్రేక్షకులను పలకరించాడు. ఐతే ఈ మూడూ రీమేక్ మూవీసే కావడంతో అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తమైంది. పవన్ నుంచి వచ్చే స్ట్రెయిట్ మూవీ కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఈ మూడూ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నవే. వీటి రిలీజ్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ‘ఓజీ’ ఈ డిసెంబర్లోనే రిలీజైపోతుందని ఒక దశలో ప్రచారం జరగ్గా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతికి అంటూ చర్చ జరిగింది. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ను ఎన్నికల లోపే రిలీజ్ చేస్తామంటూ నిర్మాత ఎ.ఎం.రత్నం ఊరించాడు.

ఐతే ఈ సినిమాలేవీ అనుకున్న ప్రకారం రిలీజయ్యే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ‘ఓజీ’ షూటింగ్‌‌కు కొన్ని నెలల కిందట బ్రేక్ వేసిన పవన్.. మళ్లీ అటు వైపే చూడలేదు. ఈ మధ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షెడ్యూల్ ఒకటి పూర్తి చేశాడు. మళ్లీ ఈ సినిమా షూట్‌కు ఆయన ఇప్పట్లో అందుబాటులోకి రాడని తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ గురించి పవన్ అస్సలు ఆలోచించే పరిస్థితి లేదు.

ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పవన్ ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తాడని తెలుస్తోంది. పై మూడు చిత్రాల్లో ఏదీ కూడా వేసవి లోపు రిలీజయ్యే అవకాశమే లేదట. ఎన్నికలు పూర్తయ్యాక కానీ.. విడుదల ఉండదని ఆయా చిత్ర బృందాలకు ఒక క్లారిటీ వచ్చేసినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యాక పవన్ విరామం లేకుండా పని చేసి ఒక్కో సినిమాను పూర్తి చేస్తాడట. వేసవి చివరి నుంచి ఒక్కో సినిమా రిలీజవుతుందని.. వచ్చే ఏడాదే ఈ మూడు చిత్రాలూ రిలీజైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.