స్టార్ హీరో సినిమాల విషయంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానిజాలు తెలుసుకునే లోపే కొన్ని విషయాలు క్షణాల్లో వైరలవుతాయి. సలార్ విడుదల తేదీ నిన్న డిసెంబర్ 22 ప్రకటించినప్పటి నుంచి దాని మీద ఎడతెగని చర్చలు మొదలయ్యాయి. కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ సలార్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రమ్ రీమేకేనని చెబుతున్న వీడియో బయటికి తీసి దాన్ని ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు.
అతను ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ లీకైన స్టోరీ, ఉగ్రం లైన్ ని పోల్చుకుని చూసుకుంటే కొంత సారూప్యత అనిపిస్తుంది కానీ మొత్తంగా మక్కికి మక్కి అయితే ఖచ్చితంగా కాదనేది ఆఫ్ ది రికార్డు యూనిట్ అంటున్న మాట. ఒకవేళ కాసేపు ఇదే నిజమనుకున్నా ఆల్రెడీ శాండల్ వుడ్ లో పెద్ద హిట్ ఆయిన ఉగ్రంని మళ్ళీ తీసి తిరిగి కన్నడ ప్రేక్షకులకు ఎందుకు ఇస్తాడనే బేసిక్ లాజిక్ మిస్ అవ్వకూడదు. అందులోనూ ఉగ్రం ఇప్పటికీ యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యూస్ కు దగ్గరగా ఉంది. తీసేసే ప్రయత్నం లాంటివేవీ చేయలేదు. అలాంటప్పుడు చూసిన కథనే ఎందుకు తీసుకుంటారు.
దీనికి సంబంధించి పూర్తి స్పష్టత రావాలంటే సలార్ ప్రమోషన్లు మొదలై ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలు ఇచ్చేదాకా బయటపడటం కష్టం. ఉగ్రం హీరో శ్రీమురళితోనే నీల్ కథ ఇచ్చిన మరో సినిమా వేరే దర్శకుడితో ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. అది కూడా ఉగ్రంకి కొనసాగింపనే ప్రచారం బెంగళూరు వర్గాల్లో ఉంది. ఇంకో మూడు నెలల్లో విడుదల ఉన్న నేపథ్యంలో హోంబాలే ఫిలిమ్స్ ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లాన్లను సిద్ధం చేస్తోంది. పోటీగా ఉన్న డుంకీకి ధీటుగా పబ్లిసిటీకి ప్లాన్ రెడీ అయ్యింది. ఈ నెల ప్రభాస్ పుట్టినరోజున ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రచార పర్వాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు.