నా సామిరంగా కోసం ఇద్దరు భామలు

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న నా సామి రంగాకు ఇద్దరు హీరోయిన్లను లాక్ చేసినట్టు తాజా సమాచారం. వాళ్లలో మొదటి అమ్మాయి ఆషిక రంగనాథ్. కన్నడ భామ. ఆ మధ్య కళ్యాణ్ రామ్ అమిగోస్ లో చేసింది కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తనకెలాంటి గుర్తింపు రాలేదు. శాండల్ వుడ్ లో చెప్పుకోదగ్గ హిట్లున్నాయి కానీ తెలుగులో రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఫైనల్ గా నాగ్ తో జోడి కుదిరింది. ఈ పేరు  కొన్ని వారల క్రితమే బయటికి వచ్చినప్పటికీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో ప్రకటన రావొచ్చు.

ఇక రెండో భామ మిర్న మీనన్. మలయాళీ కుట్టి. తనకూ టాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో, అల్లరి నరేష్ ఉగ్రంలో జోడి కట్టింది కానీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. జైలర్ లో రజనీకాంత్ కోడలిగా నటించింది ఈ అమ్మడే. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ క్యారెక్టర్ కున్న పరిమితి వల్ల నటించేందుకు స్కోప్ దక్కలేదు. నా సామిరంగాలో ఏ పాత్రనేది తెలియాల్సి ఉంది. ఇందులో అల్లరోడితో పాటు రాజ్ తరుణ్ ఉన్నాడు కాబట్టి వాళ్లకు కూడా జోడి ఉంటుందా లేక వీళ్ళలో ఒకరా అనేది స్పష్టత లేదు. మొత్తానికి మంచి సెటప్ అయితే కుదురుతోంది.

సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్న నా సామిరంగా ఇంకా డేట్ ని లాక్ చేసుకోలేదు. గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, ఫ్యామిలీ స్టార్ కన్ఫర్మ్ చేసుకున్నాయి కాబట్టి వీటి మధ్యలో తన సినిమాని దింపాలా వద్దానే విషయంలో నాగ్ కొంత సందిగ్ధంలో ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ రిస్క్ చేసినా కూడా ఓపెనింగ్స్ మీద ప్రభావంతో ఉంటుంది. టాక్ ఎంత బాగున్నా వాటిని డామినేట్ చేసే స్థాయిలో నా సామిరంగా షేప్ అవుతుందా లేదానేది కనీసం సగం షూటింగ్ అయ్యాక ఒక అవగాహనకు రావొచ్చు. ఈ సస్పెన్స్ అంత ఈజీగా తీరదు. టీజర్ లో పండక్కు అన్నారు కానీ అది సంక్రాంతి అవ్వొచ్చు లేదా శివరాత్రి కావొచ్చు.