స‌లారోడికి స‌వాళ్లెన్నో..

ఎట్ట‌కేల‌కు స‌స్పెన్స్ వీడింది. స‌లార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 22న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఆ రోజే షారుఖ్ ఖాన్ మూవీ డుంకి కూడా రిలీజ్ కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ స‌లార్ టీం వెన‌క్కి త‌గ్గ‌లేదు.

స‌లార్‌ను చూసి డుంకి భ‌య‌ప‌డాలే త‌ప్ప‌.. ఆ సినిమాను చూసి ప్ర‌భాస్ చిత్రం బెదిరిపోయే ప‌రిస్థితి ఎంత‌మాత్రం లేద‌ని అభిమానులు ఎలివేష‌న్లు ఇస్తున్నారు. ఐతే అలాగ‌ని స‌లార్‌కు ఈ డేట్ పూర్తి అనుకూల‌మ‌ని చెప్ప‌డానికి వీల్లేదు. ఇండియాలోనే కాక విదేశాల్లోనూ స‌లార్‌కు కొన్ని స‌వాళ్లు త‌ప్ప‌వు. ద‌క్షిణాదిన స‌లార్ దెబ్బ‌కు డుంకి త‌ట్టుకోలేక‌పోవ‌చ్చు కానీ.. షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాని కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా అంటే ఉత్త‌రాదిన మామూలు క్రేజ్ ఉండ‌వు.

మ‌ల్టీప్లెక్సుల్లో ఆ చిత్రం క‌నీసం స‌గం స్క్రీన్ల‌ను తీసుకుంటుంది. ద‌క్షిణాదిన కూడా ఒక మోస్త‌రుగా స్క్రీన్లు డుంకికి వెళ్తాయి. ఆ సినిమాకు మంచి టాక్ వ‌చ్చి.. స‌లార్‌కు టాక్ కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది త‌ప్ప‌దు. సెప్టెంబ‌రు 28న లేదా ఇంకో డేట్‌లో సోలోగా రిలీజై ఉంటే స‌లార్‌కు వ‌చ్చే వ‌సూళ్ల మోత వేరుగా ఉండేది. ఇక విదేశాల్లో స‌లార్‌కు మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు.

డుంకికి ఇండియాలో కంటే విదేశాల్లో మంచి డిమాండ్ ఉండ‌బోతోంది. ఆ సినిమాకు ఆల్రెడీ భారీగా స్క్రీన్లు అట్టిపెట్టారు యుఎస్, యూకే, గ‌ల్ఫ్ కంట్రీస్‌లో. ఇంకోవైపు క్రిస్మ‌స్ వీకెండ్లో ఆక్వామ‌న్, వాంకీ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ‌వుతున్నాయి. ఇందులో ఆక్వామ‌న్ మేజ‌ర్ ఐమాక్స్ స్క్రీన్ల‌ను తీసుకోబోతోంది. దీంతో స‌లార్‌ను ఇంత‌కుముందు అనుకున్న‌ట్లు భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డం క‌ష్టం. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్ల‌లో బాగా కోత ప‌డుతుంది. మ‌రి ఈ స‌వాళ్ల‌ను దాటి స‌లార్ ఎంత పెద్ద హిట్ట‌వుతుందో చూడాలి.