‘సలార్’ టీం ముందు సారీ చెప్పాల్సింది

మొత్తానికి ‘సలార్’ రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్సుకి తెరపడింది. సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడ్డ ఆ చిత్రం.. ఉత్కంఠకు తెరదించుతూ డిసెంబరు 22న తమ చిత్రం రాబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నాలుగు రోజుల ముందే ఈ విషయం ఖరారైంది. తమ డిస్ట్రిబ్యూటర్లకు కొత్త డేట్ గురించి మెయిల్ పంపడమే కాక.. శుక్రవారం ప్రకటన చేయబోతున్నట్లు తెలిపిన హోంబలె ఫిలిమ్స్.. ఈ రోజు ఆ ప్రకారమే ప్రకటన చేసింది. కానీ సలార్ కొత్త డేట్ పలు చిత్రాలకు ఇబ్బందికరంగా మారింది.

‘సలార్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇలాంటి భారీ చిత్రం వస్తే బరిలో ఉన్న ఏ సినిమాకైనా ఇబ్బందే. బాలీవుడ్ మూవీ ‘డుంకి’ వసూళ్లపై ‘సలార్’ తీవ్ర ప్రభావమే చూపుతుందనడంలో సందేహం లేదు. కానీ ‘డుంకి’ టీం చేయగలిగింది ఏమీ లేదు. బాలీవుడ్లో అయితే రిలీజ్ డేట్ల విషయంలో ఒక కట్టుబాటు ఉంటుంది. భారీ చిత్రాల విషయంలో చాలా ముందుగానే డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ఒకేసారి రెండు చిత్రాలు రావడానికి బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉన్నపుడు మాత్రమే పోటీ ఉంటుంది.

ఈ అండర్‌స్టాండింగ్ మేరకే ‘డుంకి’ రిలీజ్ ఫిక్స్ చేసుకోగా.. ఇప్పుడు అనుకోకుండా ‘సలార్’ వచ్చి పడింది. సినిమాను ఆ టైంకి రెడీ చేయలేకపోతే తప్ప ‘డుంకి’ కూడా క్రిస్మస్‌కు రాబోతున్నట్లే. ఐతే ‘డుంకి’ టీంతో ‘సలార్’ టీమ్ మాట్లాడుకుని థియేటర్లు సహా ఇతర విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకుందో ఏమో తెలియదు. ఐతే ‘డుంకి’ తట్టుకున్నట్లు ‘సలార్’ దెబ్బకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తట్టుకోలేవు. చాలా ముందుగానే క్రిస్మస్‌కు డేట్లు ఫిక్స్ చేసుకున్న సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలకు ఇప్పుడు డేట్ మార్చుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

ఇది ఆయా చిత్ర బృందాలకు తీవ్ర ఇబ్బంది కలిగించేదే. అసలు క్రిస్మస్ డేట్‌కు రావాలనుకుంటే.. ఆ సీజన్‌కు ఫిక్స్ అయిన వేరే చిత్రాల నిర్మాతలకు సర్దిచెప్పి, సారీ చెప్పి ‘సలార్’ టీం ఆ డేట్ తీసుకోవాల్సింది. ‘సలార్’ టీం నెల రోజులుగా ఆడుతున్న దాగుడుమూతలు చూస్తుంటే.. అసలు ఆయా చిత్ర బృందాలకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా సారీ చెప్పాలి. రిలీజ్ డేట్ ప్రకటన చేసేటపుడు కూడా తాము చాలామందిని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పి హుందాతనం ప్రదర్శించి ఆపై డేట్ ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.