కొన్నిసార్లు రాజకీయ పరిణామాలకు సినిమా హీరోలు బలి కావాల్సి ఉంటుంది. బొమ్మరిల్లు సిద్ధార్థ్ కు అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. తన తాజా చిత్రం చిత్తా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డబ్బింగ్ చేశారు కానీ పోటీ వల్ల రిలీజ్ ని వాయిదా వేశారు. దీని ప్రమోషన్లలో భాగంగా సిద్దు బెంగళూరు వెళ్లి అక్కడో ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు. ఇంకా సమావేశం మొదలుకాకుండానే కావేరి జలాల కోసం పోరాడుతున్న కొందరు సామజిక కార్యకర్తలు తనను మాట్లానివ్వకుండా అడ్డుపడి బయటికి వెళ్లే దాకా వదల్లేదు. మీడియా సర్దిచెప్పాలని చూసినా లాభం లేకపోయింది.
ప్రస్తుతం కర్ణాటక తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం తీవ్ర స్థాయిలో రగులుతోంది. ఏకంగా రాష్ట్ర బందులకు పిలుపు ఇచ్చే దాకా పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో అరవ సినిమాలను ప్రోత్సహించవద్దంటూ కన్నడ సంఘాలు పిలుపునిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో చంద్రముఖి 2, ఇరైవన్, చిత్తాల స్క్రీనింగ్ లు కూడా ఆపారట. ఇప్పుడు సిద్దార్థ్ ని ఏకంగా ప్రెస్ మీట్ నుంచి పంపేయడం కోలీవుడ్ వర్గాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. కళాకారులకు బాషతో సంబంధం ఉండదని, అలాంటప్పుడు ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం తప్పని భగ్గుమంటున్నాయి.
కావేరి కాంట్రావర్సీ కొత్త కాదు కానీ తాజాగా పరిణామాలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. గతంలో ఇదే అంశం మీద రెండు వైపులా నటీనటులు ధర్నాలు, నిరాహారదీక్షలు చేశారు. అయినా శాశ్వత పరిష్కారం కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయి. ఇప్పుడు చూస్తేనేమో కెమెరాల సాక్షిగా సిద్దార్థ్ లాంటి పేరున్న హీరోలను సైతం వెళ్ళిపోమని ఆదేశాలిస్తున్నారు. అతను మాత్రం సంయమనం కోల్పోకుండా కూల్ గా అక్కడి నుంచి సెలవు తీసుకున్న వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. దీని గురించి పలువురు తమిళ నటులు దర్శక నిర్మాతలు ఘాటుగా స్పందించే అవకాశముంది.